ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు కేటాయిస్తారన్న ప్రచారం కర్ణాటకలో జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి మూడు రాజ్యసభ సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ మూడింటిలో ఒకటి ఎలాగూ సీఎం సిద్ధరామయ్యకు కేటాయించనున్నారనే లీకులు వస్తుండగా, మిగిలిన రెండు స్థానాలపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. హైకమాండ్ కోటా పరిధిలో పరిశీలిస్తున్న పేర్లలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేడాతో పాటు వైఎస్ షర్మిల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
పార్టీని విలీనం చేసిన సమయంలో రాహుల్ హామీ
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత శూన్యమైన విపక్ష స్థానాన్ని భర్తీ చేయడానికి, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడానికి షర్మిల గట్టిగానే శ్రమిస్తున్నారు. సొంత అన్న, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని సైద్ధాంతికంగా ఢీకొంటూ కాంగ్రెస్ వాయిస్‌ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఆమెకు పార్లమెంట్లో స్థానం కల్పించడం ద్వారా ఏపీ కాంగ్రెస్ కేడర్‌కు ఒక బలమైన భరోసా ఇచ్చినట్లవుతుందని, జగన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమెకు హైకమాండ్ ఇచ్చే పొలిటికల్ రివార్డ్ గా ఇది నిలుస్తుందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో ఆమెకు పార్టీని విలీనం చేసేసమయంలో హామీ కూడా ఇచ్చారు.
డీకే శివకుమార్ సపోర్టు ఉండే చాన్స్
కర్ణాటకలోని మిగిలిన స్థానాల్లో జాతీయ నేత పవన్ ఖేడా పేరు కూడా గట్టిగా పరిశీలనలో ఉంది. కాంగ్రెస్ జాతీయ మీడియా విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఖేడాకు పెద్దల సభలో అవకాశం కల్పించాలని ఏఐసీసీ భావిస్తోంది. అయితే, దక్షిణాది రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్సార్ అనుచరవర్గాన్ని ఆకర్షించడానికి షర్మిల వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇన్సైడ్ టాక్. పైగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, కర్ణాటకలోని డీకే శివకుమార్ వంటి అగ్రనేతలతో వైఎస్ కుటుంబానికి దశాబ్దాల కాలంగా ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా షర్మిలకు ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనున్నాయి.
షర్మిలకు ఛాన్సెస్ తక్కువే!
మొత్తం పొలిటికల్ ఈక్వేషన్లను బేరీజు వేసి చూస్తే, వైఎస్ షర్మిలకు కర్ణాటక నుండి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు 70 శాతం వ్యతిరేకంగా , 30 శాతం అనుకూలంగా కనిపిస్తున్నాయి. అటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంకా గాంధీ ఇద్దరికీ షర్మిల పట్ల సానుకూల దృక్పథం ఉన్నా.. పెద్ద నేతలు రేసులో ఉండటం వల్ల అవకాశాలు తగ్గిపోతున్నాయి. అయితే ఆమె పేరును పరిశీలించడం వరకు మాత్రం షర్మిల హ్యాపీ అనుకోవచ్చు.
