వైఎస్ కుటుంబానికి గడ్డ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి పులివెందుల నియోజకవర్గంలో ఏళ్ల తరబడి .. ఫ్యాక్షన్‌కు ఎదురీదిన టీడీపీ నేతలు బీటెక్ రవి, ఎమ్మెల్ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బయట పెడుతున్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటివరకు తెరవెనుక నడిచిన కొన్ని మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ డీలింగ్స్‌ను వారు మీడియా సాక్షిగా బహిర్గతం చేయడంతో కడప జిల్లాతో పాటు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా మునుపెన్నడూ లేనంతగా హీట్ పెరిగింది.
బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేసిన అవినాష్ రెడ్డి
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవిని టార్గెట్ చేస్తూ.. ఆయన అమ్ముడుపోయాడనే తరహాలో చేసిన విమర్శలకు, రవి ఇచ్చిన హై-వోల్టేజ్ కౌంటర్ ఇప్పుడు వైకాపా టాప్ లీడర్షిప్ను సైతం ఆత్మరక్షణలో పడేసింది. నన్ను కొనడం నీవల్ల కాదు.. నీ అన్న జగన్ వల్ల కూడా కాదు అంటూ బీటెక్ రవి.. అవినాష్ రెడ్డి అసలు రంగును బయటపెట్టారు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును హైకోర్టు నుంచి వెనక్కి తీసుకునేలా తనకు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి అవినాష్ రెడ్డే స్వయంగా బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేశారంటూ బాంబు పేల్చారు. అంతటితో ఆగకుండా, గతంలో వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడానికి ఎంపీటీసీలను క్యాంపులకు పంపింది అవినాషేనని బయట పెట్టారు.
అమరావతికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీలను కొన్నారు !
అలాగే అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏకంగా రూ.15 కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలను టీడీపీకి ఏకగ్రీవం చేసేలా లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నది నిజం కాదా? అంటూ ఉల్లిమెట్ట తోట సాక్షిగా అవినాష్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. బీటెక్ రవి సృష్టించిన ఈ పొలిటికల్ ఊపునకు తోడుగా, టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మరింత పురాతన, సంచలనాత్మక చరిత్రను తవ్వి తీశారు. వైఎస్ కుటుంబానికి పులివెందులలో దశాబ్దాలుగా ఉన్న ఫ్యాక్షన్ , హత్యల రాజకీయాల్లో ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. గతంలో జరిగిన ఒక జంట హత్యల కేసు దర్యాప్తు వ్యవహారాల్లో అప్పటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రదర్శించిన మితిమీరిన రాజకీయ జోక్యం, ఒత్తిళ్ల కారణంగా ఏకంగా ఒక సిట్టింగ్ జడ్జి తన ఉద్యోగాన్నే కోల్పోవాల్సి వచ్చిందని భూమిరెడ్డి గుర్తుచేశారు.
పాపాలు పండే సమయం వచ్చేసింది !
పులివెందులలో స్థానిక ఎన్నికల నుంచి అసెంబ్లీ వరకు ప్రత్యర్థులను శారీరకంగా, రాజకీయంగా నిర్మూలించడానికి వైఎస్ కుటుంబం ఏ స్థాయికి దిగజారుతుందో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యమన్నారు. ప్రస్తుతం కడప పాలిటిక్స్‌లో ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు కేవలం ఒక వైపు నుంచే విమర్శలు విన్న కడప ప్రజలకు, ఇరువైపులా ఉన్న లీకులు, లోపాయికారీ ఒప్పందాల బండారం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. బీటెక్ రవి అన్నట్లు.. ఇప్పటివరకు మీరు చూసింది కేవలం పుష్ప ట్రైలర్ మాత్రమే.. త్వరలోనే పుష్ప 2, పుష్ప 3 రేంజ్లో వైఎస్ ఫ్యామిలీ గుట్టుమట్లను ఆధారాలతో సహా బయటపెడతాం అనడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో పులివెందుల రాజకీయం మరింత హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
