తమిళనాడు అసెంబ్లీలో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు తిరుగుబాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలనుకున్న విజయ్ వ్యూహం ఫలించడం లేదు. అసెంబ్లీలో సొంతంగా పూర్తి మెజారిటీకి కొద్దిపాటి దూరంలో నిలిచిన టీవీకే, విపక్ష ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉపఎన్నికల ద్వారా తమ బలాన్ని పెంచుకోవాలని భావించింది.అయితే, ఈ పొలిటికల్ జూదంలో ఇప్పటివరకు కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తమ పదవులకు రాజీనామా చేసి విజయ్ గూటికి చేరారు. మిగిలిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు పదవులు వదులుకునేందుకు సిద్ధంగా లేరు. తిరిగి వారు అన్నాడీఎంకే గూటికి చేరుతున్నారు.
విజయ్ తొందరపాటు
ప్రారంభంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన 25 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలలో మెజారిటీ నేతలు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి విప్‌ను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన వీరంతా.. తీరా చూస్తే తమకు కేబినెట్ పదవులు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనికి తోడు అన్నాడీఎంకే నాయకత్వం వీరిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయడానికి స్పీకర్‌ను ఆశ్రయించడంతో తిరుగుబాటు వర్గంలో వణుకు మొదలైంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత ఎస్.పి. వేలుమణి వర్గం ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకుని, పళనిస్వామియే తమ నాయకుడంటూ మళ్లీ ఆయనతో రాజీపడిపోయేందుకు తెరవెనుక రాయబారాలు నడిపారు. ఆల్రెడీ ఎస్.ఎం. సుకుమార్ సహా ఆరుగురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ క్యాంపునకు చేరిపోవడంతో విజయ్ ఆఫర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని స్పష్టమవుతోంది.
ఉపఎన్నికలు కత్తి మీద సాము
రాజీనామా చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేల స్థానాల్లో మళ్లీ ఉపఎన్నికలకు వెళ్లడం విజయ్‌కు ఇప్పుడు కత్తి మీద సాము లాంటిదే. నిన్నటి వరకు అన్నాడీఎంకే గుర్తుపై గెలిచిన సదరు నేతలు, రేపు టీవీకే గుర్తుపై పోటీ చేసినప్పుడు ఓటర్లు వారిని ఆదరిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దశాబ్దాల చరిత్ర ఉన్న అన్నాడీఎంకే క్యాడర్ ఈ రాజీనామాలను ద్రోహం గా భావిస్తుండటంతో క్షేత్రస్థాయిలో టీవీకేకు గట్టి వ్యతిరేకత ఎదురయ్యేలా ఉంది. డీఎంకే, అన్నాడీఎంకే వంటి బలమైన ప్రాంతీయ శక్తులు ఈ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి విజయ్ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి.
తేడా వస్తే రిస్కే
కొత్తగా అధికారంలోకి వచ్చిన నటుడు విజయ్, కేవలం తనకున్న సినిమా క్రేజ్ , ఎన్నికల వేవ్‌నే నమ్ముకుని ఈ రాజకీయ సాహసానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. కానీ, ప్రాథమికంగా మద్దతు ఇస్తామన్న 25 మందిలో కేవలం నలుగురిని మాత్రమే ఆయన నిలుపుకోగలిగారు, మిగిలిన వారంతా అనర్హత నుంచి తప్పించుకునేందుకు తిరిగి సొంత గూటికి చెక్కేస్తున్నారు. రాజకీయాల్లో కేవలం క్రేజ్ అనేది తాత్కాలికమేనని, క్షేత్రస్థాయిలో క్యాడర్ , సిద్ధాంతం లేకపోతే ఇలాంటి ఫిరాయింపుల రాజకీయాలు ప్రభుత్వాల నైతిక పతనానికి దారితీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో రాబోయే ఉపఎన్నికల సవాల్‌ను దళపతి ఎలా ఎదుర్కొంటారో చూడాలి!
