తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత భారత్ రాష్ట్ర సమితి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు, ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన యువనేతల దూకుడు ఇప్పుడు స్వంత పార్టీలోనే పెద్ద చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వంటి నాయకులు అధికార పక్షాన్ని ఎదుర్కొనే క్రమంలో వాడుతున్న భాష, ప్రదర్శిస్తున్న ఉద్రేకం శృతిమించుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ కంట్రోల్ తప్పి మాట్లాడుతుండగా.. బాల్క సుమన్ వంటి నేతలు ఏకంగా భౌతిక దాడులు, తగులబెట్టడాలంటూ ఇస్తున్న పిలుపులు పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి.
అసాంఘిక శక్తులకు ప్రజల నుంచి తిరస్కరణే
ఈ యువనేతలు ఒక ప్రాథమిక వ్యత్యాసాన్ని మర్చిపోతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన కరుకు భాష, చేసిన ఆందోళనలు, తగులబెట్టడాలు నాడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యమ ఖాతాలోకి పోయాయి. కానీ, ఇప్పుడు నడుస్తున్నది పక్కా పార్లమెంటరీ రాజకీయం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు బాధ్యతాయుతమైన ప్రవర్తనను కోరుకుంటారు. విపక్ష నేతల మాటలను, చర్యలను ప్రజలు గనుక అసాంఘిక ధోరణి గా భావిస్తే, ప్రజాస్వామ్యంలో తీవ్రమైన తిరస్కరణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సున్నితమైన రాజకీయ సత్యాన్ని యువతరం లీడర్లు గ్రహించలేకపోతున్నారనేది స్పష్టమవుతోంది.
కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
ఈ కొత్త తరం నేతలు ఇంతలా దారితప్పుతున్నా, పార్టీ అధినేత కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వారిని ఎందుకు అదుపు చేయడం లేదనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద మిస్టరీగా మారింది. గతంలో పార్టీ క్రమశిక్షణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించిన కేసీఆర్.. ఇప్పుడు కేటీఆర్, సుమన్ వంటి వారి దూకుడుపై కనీసం మందలించిన దాఖలాలు లేకపోవడం శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బహుశా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలను గట్టిగా తట్టుకోవాలంటే ఈ స్థాయి అగ్రెసివ్ పాలిటిక్స్ అవసరమని ఆయన భావిస్తున్నారా, లేక పార్టీ పగ్గాలు పూర్తిగా యువనేతల చేతుల్లోకి వెళ్లడం వల్లే ఈ మౌనమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసంతృప్తిలో సీనియర్ నేతలు
బీఆర్ఎస్ లోని పాతతరం, సీనియర్ నాయకులకు ఈ కొత్త తరం దూకుడు ఏమాత్రం నచ్చడం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్లు.. ఇలాంటి తీవ్ర పదజాలం వల్ల తటస్థ ఓటర్లు, విద్యావంతులు పార్టీకి మరింత దూరం అవుతారని ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, అవి పరిధి దాటినప్పుడు వచ్చే నష్టం పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారుతుంది. కేసీఆర్ ఇప్పటికైనా జోక్యం చేసుకుని పార్టీ శైలిని మార్చకపోతే, రాబోయే రోజుల్లో ప్రజాదరణను తిరిగి సంపాదించుకోవడం గులాబీ దళానికి అంత సులువు కాకపోవచ్చు.
