ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు, సినిమా పరిస్థితి బాగోలేదు, సింగిల్ స్క్రీన్స్ నష్టాల్లో వున్నాయి, ఓటీటీ ప్రభావం పెరిగింది, పైరసీ వల్ల నష్టాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి, నిర్మాతల పరిస్థితి దారుణంగా ఉంది.. సినిమా ఈవెంట్లలో, మీడియా సమావేశాల్లో దాదాపు ఇవే మాటలు వినిపిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సినిమా కూడా ఒక వ్యాపారమే. వ్యాపారంలో లాభాలు, నష్టాలు, ఒత్తిడులు, రిస్కులు సహజం. ఇవన్నీ తెలుసుకునే రంగంలోకే వస్తారు. అలాంటప్పుడు ప్రతి అపజయాన్ని పరిశ్రమ సంక్షోభంగా చిత్రీకరించడం ఎందుకు? అని ప్రశ్నించారు మధుర శ్రీధర్.
“సమస్యలు… సమస్యలు…” అంటూ ఏడవడం వల్ల ఇండస్ట్రీ పరువు మాత్రమే పోతుంది. ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు, భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం అయినట్టు మాట్లాడటం సరికాదు. సినిమా ఒక బిజినెస్… ఛారిటీ కాదు. నిజంగా పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే సినిమాలు తీయకండి. ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోండి” అని ఆయన ఓపెన్‌గా చెప్పారు.
మధుర శ్రీధర్ వ్యాఖ్యల్లో కొంత కఠినత్వం ఉన్నా, అందులో ఒక వాస్తవికత కూడా ఉంది. ఒక సినిమా సరిగ్గా ఆడకపోవడానికి, జనం థియేటర్స్ రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే ప్రతి సారి సినిమా సమస్యల గురించే ఏకరువు పెట్టడం అంత ఆరోగ్యకరం కాదు.
నిజానికి ట్రైలర్, టీజర్ నచ్చితే ప్రేక్షకులు టికెట్ కొని సినిమా చూడటానికి వస్తారు. వారి ఉద్దేశం పరిశ్రమ ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపడం కాదు. ఏదో కొత్తదనం, ఆకర్షణ కనిపిస్తేనే టికెట్ తెగుతుంది. బిజినెస్ పరంగా చూసుకుంటే ప్రేక్షకుడు సినిమాను కాలక్షేపాన్ని పంచే ఎంటర్టైన్మెంట్ సర్వీస్‌గానే చూస్తాడు. కానీ ఒక పరిశ్రమను నిలబెట్టాలనే ఉద్దేశంతో థియేటర్‌కు రాడు. అలాంటప్పుడు ప్రతిసారి సమస్యలను ప్రేక్షకుల ముందు ఏకరువు పెట్టడం అరణ్యరోదనగానే ఉంటుంది.
“సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు” అన్న ఆయన వ్యాఖ్యలో కూడా ఒక లాజిక్ ఉంది. సినిమా వేడుక అనేది ప్రేక్షకులతో ఆనందాన్ని పంచుకోవడానికి, సృజనాత్మకతను సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండాలి. అవి పరిశ్రమ ఆవేదనల సభలుగా మారితే ప్రేక్షకులకు కూడా విసుగు కలిగించే ప్రమాదం ఉంటుంది.
ఇటీవల ఓ ఎగ్జిబిటర్ సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక ఉదాహరణతో వివరించారు. ఆయన చెప్పిన లెక్కలు వింటే, ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు నిర్మించడం కూడా అనవసరమేనేమో అన్న భావన కలుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలను బహిరంగంగా చెప్పడం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ.
దానికి తాజాగా ఒక ఉదాహరణ కూడా కనిపించింది. ఓ వర్ధమాన నటుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ విడుదల చేసిన వీడియోలో, పరిశ్రమ పరిస్థితిపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యల ప్రభావంతో తమ సినిమాకు ముందుకు రావాలనుకున్న నిర్మాత చివరి నిమిషంలో వెనక్కి తగ్గిపోయాడని చెప్పాడు. “ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదని భావించి, రాత్రికి రాత్రే నిర్మాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సినిమా యూనిట్ మొత్తం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది” అంటూ తన బాధను వెల్లడించాడు.
అంటే, సమస్యల గురించి మాట్లాడకూడదని కాదు. కానీ వాటిని నిరంతరం సంక్షోభంగా చిత్రీకరించడం వల్ల పరిశ్రమపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది. పెట్టుబడిదారులు వెనక్కి తగ్గొచ్చు, కొత్త నిర్మాతలు భయపడొచ్చు, చిన్న సినిమాలకు అవకాశాలు మరింత తగ్గిపోవచ్చు. అందుకే సమస్యలపై చర్చతో పాటు, వాటికి పరిష్కార మార్గాలపై కూడా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
మొత్తానికి మధుర శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు కటువుగా అనిపించినా, పరిశ్రమలో ఆత్మపరిశీలన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. సమస్యలు ఉన్నాయనే విషయాన్ని ఎవరూ ఖండించలేరు. కానీ ప్రతి సందర్భంలో వాటినే ప్రస్తావించడం కంటే, మంచి సినిమాలు రూపొందించడం ద్వారా ప్రేక్షకుల విశ్వాసాన్ని గెలుచుకోవడమే దీనికి పరిష్కారం.
ఏ పరిశ్రమ కూడా సానుభూతితో నిలబడదు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సానుభూతి కంటే సృజనాత్మకత ముఖ్యం. సమస్యలు చెప్పడం కంటే సృజనాత్మకతకు పదును పెడితే కొత్త దారులు కనిపిస్తాయి.
