తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగినప్పుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరీ ఆయనకు ఆ పదవి వచ్చేలా చేశారన్నది బహిరంగ రహస్యం. రేవంత్ రెడ్డికి నమ్మకస్తుడిగా, పార్టీలో సమన్వయకర్తగా ఉంటారని భావించిన మహేష్ గౌడ్.. బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే సొంత పార్టీలోని ఒక వర్గం నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే మీడియా సంస్థలే మహేష్ గౌడ్‌పై డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వరుస కథనాలు ప్రచారం చేయడం వెనుక ఏదో బలమైన రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సొంత గూడు లేదు.. పట్టు చిక్కడం లేదు
మహేష్ గౌడ్ మాస్ లీడర్ కాదు. ఆయనకు సొంత నియోజకవర్గం లేకపోవడం. ఒక కార్పొరేటర్‌గా కూడా గెలవలేని నాయకుడు ఏకంగా రాష్ట్ర పార్టీని ఎలా నడిపిస్తారని ఆయన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి దూకుడుగా ఉండేవారని, కానీ ఇప్పుడు మహేష్ గౌడ్ హయాంలో గాంధీ భవన్ కళ తప్పిందని క్యాడర్ భావిస్తోంది. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా నడుచుకుంటూ పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయాల్సింది పోయి.. కొన్ని కీలక నిర్ణయాల్లో సొంత అజెండాతో ముందుకు వెళ్తుండటం రేవంత్ వర్గానికి మింగుడు పడటం లేదని తెలుస్తోంది.
వివాదాల్లో జోక్యం.. గ్యాప్ పెంచుతోందా?
మహేష్ గౌడ్ కొన్ని భూ వివాదాల్లో, నేరుగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే పార్టీ పరంగా వరంగల్ వంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలతో సంప్రదించకుండానే తీసుకున్న కొన్ని నిర్ణయాలు రచ్చకెక్కాయి. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నేతలకు చెక్ పెట్టేలా ఆయన వ్యవహారశైలి ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనివల్లనే రేవంత్ రెడ్డి ఇప్పుడు మహేష్ గౌడ్ వ్యవహారంలో మౌనంగా ఉంటున్నారని, ఆయనపై వస్తున్న మీడియా దాడులను ఆపే ప్రయత్నం చేయడం లేదని అభిప్రాయపడుతున్నారు. పార్టీకి బలమైన గొంతుక గా ఉండాల్సిన పీసీసీ చీఫ్.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు సొంత పార్టీలోని ‘పెద్దల’ అసమ్మతి మధ్య మహేష్ గౌడ్ ఇరుక్కుపోయారు.


