ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మరో మహిళా నేత దూసుకొస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి రెడ్డి హఠాత్తుగా ప్రెస్‌మీట్ నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా అడుగులు పడుతుండటంతో, రాబోయే రోజుల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం ఖాయమనే సంకేతాలతో మహిళా నేతలు ఫోకస్ అవుతున్నారు.
తన ప్రెస్మీట్లో సాయి వైష్ణవి ప్రధానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత పాలనను, ఆయన రాజకీయ శైలిని లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో తమ కుటుంబం వైసీపీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసినా, కనీసం మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుడనే వాడు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలి తప్ప.. అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ప్యాలెస్ రాజకీయాలు చేయడం సరికాదని ఆమె ఘాటుగా విమర్శించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిని నిర్వీర్యం చేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదేనని, కేవలం ఫోన్ ట్యాపింగ్‌లు, కక్షసాధింపు రాజకీయాలకే వారు పరిమితమయ్యారని విమర్శించారు.
ఈ ప్రెస్‌మీట్ కేవలం ఒక సాధారణ విమర్శల పర్వంగా కాకుండా, నెల్లూరు రాజకీయాల్లో కోటంరెడ్డి కుటుంబం తన తదుపరి తరాన్ని అధికారికంగా రంగంలోకి దించినట్లుగా భావించవచ్చు. గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మరియు పార్టీ మారే సంక్షోభ సమయాల్లో ఆయన కుమార్తెలు హైందవి, వైష్ణవిలు క్షేత్రస్థాయిలోకి వచ్చి కేడర్‌కు ధైర్యం చెప్పారు. ఇప్పుడు లోక్‌సభ , అసెంబ్లీ స్థానాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు కావడం 100 శాతం ఖాయంగా కనిపిస్తుండటంతో.. భవిష్యత్తులో నెల్లూరు రూరల్ లేదా జిల్లాలోని మరో కీలక స్థానం నుండి సాయి వైష్ణవిని కూటమి తరఫున బరిలోకి దించేందుకే ఈ వ్యూహాత్మక ప్రెస్మీట్లు మరి, లిటికల్ ఎంట్రీలు ప్లాన్ చేస్తున్నారని చేసుకోవచ్చు.
తండ్రి శ్రీధర్ రెడ్డి లాగే ఆమె కూడా తన వాగ్ధాటితో, దూకుడు సమాధానాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది ఎన్నికల నాటికి యువ రక్తాన్ని చట్టసభల్లోకి పంపేందుకు కోటంరెడ్డి పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమ్మాయిల రాజకీయ ప్రాతినిధ్యం పెరగడం ఖాయమైన సమయంలో ఇలాంటి నేతలు తెరపైకి రావడం టీడీపీ క్యాడర్‌ను సంతృప్తి పరుస్తోంది.
