బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తృణమూల్ కాంగ్రెస్ పునాదుల్ని కదిలిస్తోంది. ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం ముదిరింది. ఈ ఓటమి ప్రభావం ఇప్పుడు పార్లమెంటులో ఆ పార్టీ ఉనికిపై పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోక్‌సభలో ఉన్న 29 మంది టీఎంసీ సభ్యుల్లో దాదాపు 20 మంది ఎంపీలు ఇప్పటికే కమలం గూటి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి రక్షణ పొందేందుకు అసమ్మతి ఎంపీలు ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చట్టప్రకారం అనర్హత వేటు పడకుండా ఉండాలంటే మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఏకతాటిపైకి రావాల్సి ఉంటుంది. ఈ లెక్కన 19 నుండి 20 మంది ఎంపీలను ఒకేసారి బీజేపీలో విలీనం చేయడం ద్వారా సాంకేతిక ఇబ్బందులను అధిగమించాలని వారు భావిస్తున్నారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలకు అత్యంత సన్నిహితులుగా భావించే కొందరు సీనియర్ నేతలు కూడా ఈ తిరుగుబాటు జాబితాలో ఉండటం పార్టీ అధిష్ఠానాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.
లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ తృణమూల్ కాంగ్రెస్‌కు ఇదే తరహా సెగ తగలనుంది. ప్రస్తుతం ఎగువసభలో ఉన్న 13 మంది టీఎంసీ సభ్యుల్లో సుమారు 8 మంది ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనే ఈ భారీ వలసలు ఉండవచ్చు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఒకేసారి ఇంతటి పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగితే, జాతీయ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ ప్రాభవం గణనీయంగా తగ్గిపోతుంది. ఒకవైపు పార్టీని కాపాడుకోవడానికి టీఎంసీ అగ్రనాయకత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో క్యాడర్ చెల్లాచెదురవ్వడం, సీనియర్ల అసమ్మతి ఆ పార్టీని మరింత బలహీనపరుస్తోంది
