జగన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం తాను ఎంత ఉత్తముడ్నో అని చెప్పుకునేందుకు తన తాత రాజారెడ్డి, వైఎస్ ఫ్యాక్షన్ చరిత్రను రాజకీయం చేయడంతో ఇప్పుడు మొత్తం గతంలో జరిగిన రాజకీయ హత్యాకాండచుట్టూనే తిరుగుతోంది. చిచ్చు పెట్టి.. తన తాత,తండ్రి పాత కథలన్నీ బయటకు వచ్చేలా చేసిన జనగ్ రెడ్డి, సాక్షి మీడియా మాత్రం.. వైఎస్, రాజారెడ్డి మంచి వాళ్లు అని చెప్పేందుకు సిగ్గుపడుతోంది. దానికి బదులుగా చంద్రబాబుకు బురద అంటించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన తండ్రి, తాత చరిత్రను బయట పెట్టి నిందిస్తూంటే చూస్తూషర్మిల ఉండలేకపోయారు.
ఈ వివాదంపై వైఎస్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియా అనుసరిస్తున్న వ్యూహం కూడా విమర్శలకు తావిస్తోంది. జగన్ పెట్టిన ఈ పొలిటికల్ చిచ్చు వల్ల రాజారెడ్డి, వైఎస్సార్ల పాత చరిత్ర అంతా బయటకు వస్తుండటంతో, వారిని సమర్థించేందుకు సాక్షి యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. వైఎస్సార్, రాజారెడ్డిలు ప్రజల పట్ల మంచిగా ఉండేవారని నిరూపించే ప్రయత్నం చేయలేక.. ఆ కథనాన్ని పక్కదారి పట్టిస్తూ కేవలం కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బురద జల్లేందుకే సాక్షి ప్రాధాన్యత ఇస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, తన తాత, తండ్రి చరిత్రను ఇలా రాజకీయ వివాదాల్లోకి లాగి వారిని నిందిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ లోకంలో లేని వారిపై ఇలాంటి రాజకీయ నిందలు వేయడం తగదని, వారు ఇప్పుడు బతికి లేరు కాబట్టి తమ వైపు సమాధానం చెప్పుకోలేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసం సొంత కుటుంబ పెద్దల ప్రతిష్టను పణంగా పెట్టడం సరికాదని హితవు పలికారు. తన ట్వీట్లో వైఎస్సార్, రాజారెడ్డిల గొప్పతనాన్ని ఆమె ప్రస్తావించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల నేటికీ ఆయన ఫోటో ప్రతి పేదవాడి ఇంట్లో, పూజ గదిలో దేవుడి పక్కన ఉంటుందని షర్మిల గుర్తు చేశారు.
అలాగే తన తాత రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, ఆ నాడు ఆయన చేసిన సహాయాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ మరువలేదని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇరుపక్షాలు గతాన్ని తవ్వుకుంటూ చనిపోయిన పెద్దల వ్యక్తిత్వాన్ని హననం చేయడం అత్యంత విచారకరమని ఆమె స్పష్టం చేశారు. అయితే జగన్ వైపు నుంచి తన తండ్రి, తాతను డిఫెండ్ చేయకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.


