శంషాబాద్ పరిధిలో దాదాపు *రూ. 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన భారీ భూ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక కార్పొరేషన్ చైర్మన్ , ఒక మంత్రి ఉన్నారని ఆరోపిచారు.
శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 173 నుండి 183 వరకు ఉన్న సుమారు 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు పక్కా స్కెచ్ వేశారని ఆరోపించారు. ఈ భూములపై సమగ్ర విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలంటూ ఈ ఏడాది జనవరి 30వ తేదీన హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే, కోర్టు ఆదేశాల అనంతరం కేవలం నాలుగు రోజుల వ్యవధిలో రెవెన్యూ అధికారులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు.
కోర్టు ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 24వ తేదీన ఆర్డీవో సదరు 180 ఎకరాల భూమి ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడమే కాకుండా, ఆ భూమిని కాపాడాలంటూ స్థానిక ఎమ్మార్వోను ఆదేశించారు. కానీ, ఆశ్చర్యకరంగా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే, అంటే ఫిబ్రవరి 28వ తేదీన సదరు ఎమ్మార్వో హైకోర్టులో దీనికి పూర్తి భిన్నమైన అఫిడవిట్ సమర్పించారు. ఆ భూమి ప్రభుత్వానిది కాదని, అది ప్రైవేటు వ్యక్తులకు చెందిన పట్టా భూమి అని పేర్కొంటూ రాత్రికి రాత్రే ఆన్లైన్ రికార్డుల్లో మార్పులు చేశారని హరీశ్‌రావు ఆరోపించారు.
ఒకే భూమి గురించి ఇద్దరు ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గానీ, సీసీఎల్ఏ గానీ అనుమతి లేకుండా హైకోర్టులో వేర్వేరుగా అఫిడవిట్లు ఎలా వేస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ వెయ్యి కోట్ల స్కామ్ బయటకు రాగానే కేవలం తహసీల్దార్‌ను బదిలీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఇంత సాహసం చేసే ధైర్యం ఒక చిన్న అధికారికి ఉండదని, అందుకే ఈ వ్యవహారంపై తక్షణమే సిట్ లేదా సీఐడీ తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తీవ్రమైన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.