చెన్నై చేతిలో ముంబై ఇండియన్స్ జట్టు ఘోరంగా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో గుజరాత్ పై ఘన విజయం సాధించిన ముంబై… ఫామ్ లోకి వచ్చేసిందనుకొన్నారు ముంబై అభిమానులు. కానీ.. చెన్నై తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయి, మళ్లీ కలవర పెట్టేశారు. బ్యాటింగ్ కి అనుకూలించే వాఖండే స్టేడియంలో మరీ వంద పరుగుల తేడాతో ఓడిపోవడమే బాధాకరం. ముంబై చరిత్రలోనే అత్యంత దారుణమైన పరాభవం ఇది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలోకి పడిపోయింది ముంబై. ఇక్కడ్నుంచి తేరుకొని ప్లే ఆఫ్‌కి చేరుకోవాలంటే అద్భుతాలు చేయాల్సిందే.
ముంబై ఓడిపోవడం అటుంచితే.. కెప్టెన్ గా హార్డిక్ పాండ్యా నైపుణ్యాలపై, ప్రణాళికలపై పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆల్ రౌండర్ గా చలామణీ అవుతున్న పాండ్యా.. ఈ ఐపీఎల్ లో రెండు రంగాల్లోనూ విఫలం అవుతున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పాండ్యా 2 ఓవర్లు వేసి 38 పరుగులు సమర్పించుకొన్నాడు. అంటే ఓవర్‌కి 19 పరుగులు. బ్యాటింగ్ లో 1 పరుగే చేశాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన హార్డిక్… మొత్తంగా వంద పరుగులు కూడా చేయలేకపోయాడు. ఫీల్డింగ్ మోహరింపు, బౌలింగ్ మార్పు విషయాల్లో హార్దిక్ చాలా చాలా వెనుకబడి ఉన్నాడన్నది విశ్లేషకుల మాట. బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలం అవ్వడం పక్కన పెడితే, మైదానంలో పాండ్యా చేస్తున్న ఓవర్ యాక్షన్ ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మొన్నటి మ్యాచ్‌లో తిలక్ వర్మకి ఇచ్చిన మోటివేషన్ స్పీచ్ తో.. మరింత నవ్వుల పాలు అయ్యాడు పాండ్యా. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లాంటి అనుభవజ్ఞులు ఉండగా, వరుసగా విఫలం అవుతున్న పాండ్యాకు కెప్టెన్సీ ఎలా అప్పగించారన్నది ముంబై అభిమానులకు అర్థం కాని విషయం. ఫామ్ లో లేని హార్డిక్ జట్టుకు భారంగా మారుతున్నాడని, అతని స్థానంలో మరో ఆల్ రౌండర్ ని చేర్చుకొంటే, ఇప్పటికైనా ముంబై మళ్లీ రేసులోకి వస్తుందని అభిమానులు కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు.
