‘పెద్ది’ టీమ్ అందరూ తాము ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం దర్శకుడు బుచ్చిబాబే ముక్త కంఠంతో చెబుతున్నారు. రామ్ చరణ్ నుంచి ఏ.ఆర్. రెహమాన్ వరకు ప్రతి ఒక్కరూ బుచ్చిబాబు గురించే ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. రామ్ చరణ్ మొదటి నుంచీ బుచ్చిబాబు డెడికేషన్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ లాంటి లెజెండరీ కూడా “బుచ్చిబాబు కళ్లలో కనిపించిన ఇంటెన్సిటీ చూసే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను” అన్నారు. జాన్వీ తాను బుచ్చిబాబుకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని ప్రకటించింది. తన కెరీర్లో ఎన్నోమంది దర్శకులతో పనిచేసినా, బుచ్చిబాబు లాంటి ప్యాషన్ ఉన్న దర్శకుడిని చాలా అరుదుగా చూశానని బోమన్ ఇరానీ లాంటి సీనియర్ నటుడు చెప్పడం మరో విశేషం.
‘పెద్ది’ టీమ్ బుచ్చిబాబు విజన్‌పై చాలా నమ్మకంగా ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు బుచ్చిబాబుపైనే ఉంది. ‘ఉప్పెన’ తర్వాత రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ హీరోతో పని చేసే అవకాశం అందుకున్నాడు బుచ్చి. నిజానికి గతంలో కూడా తొలి సినిమా విజయంతో రెండో చిత్రానికే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన దర్శకులు చాలామందే ఉన్నారు. సంపత్ నంది, సంతోష్ శ్రీనివాస్, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు ఆ కోవలోకి వస్తారు. కానీ రెండో సినిమాతో వచ్చిన అంచనాలను అందుకోవడం, ఆ తర్వాత కూడా అదే స్థాయిలో కెరీర్‌ను కొనసాగించడం మాత్రం అందరికీ సాధ్యపడలేదు. తొలి విజయం ఇచ్చే ఉత్సాహం ఒకటి అయితే, దాన్ని స్థిరమైన విజయంగా మార్చుకోవడం మరో విషయం.
ఇప్పుడు బుచ్చిబాబు ముందున్న పరీక్ష కూడా అదే. ‘పెద్ది’ విజయం సాధిస్తే ఆయన కేవలం హిట్ దర్శకుడిగా కాకుండా టాప్ లీగ్ స్టార్ డైరెక్టర్ల జాబితాలోకి చేరతారు. అన్నిటికంటే ముఖ్యంగా ‘పెద్ది’ టీమ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఇప్పుడు ‘పెద్ది’ ఫలితం కేవలం రామ్ చరణ్ కెరీర్‌కే కాదు, బుచ్చిబాబు భవిష్యత్తుకూ చాలా కీలకం.
ప్రస్తుతం టీమ్‌లో కనిపిస్తున్న నమ్మకం, దర్శకుడిపై ప్రశంసలు చూస్తుంటే బుచ్చిబాబు తన కథ, పని తీరుతో టీమ్‌లో అందరినీ మంత్రముగ్ధులను చేశాడని అర్థమవుతోంది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను ప్రేక్షకులు కూడా ఫీల్ అయితే బుచ్చిబాబు తన టార్గెట్‌ను రీచ్ అయినట్టే.
