ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాకుండా, పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ ప్రజాస్వామ్య విలువలను పాటించడం అత్యవసరం. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీలో చర్చలకు, భిన్నాభిప్రాయాలకు తావుండాలి. తెలుగుదేశం పార్టీ స్థాపన నుండి మహానాడు వంటి వేదికల ద్వారా కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇస్తూ వస్తోంది. అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్ నేతల నుండి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరి మాట వింటారనే పేరుంది. ఇటీవల జరిగిన హైబ్రిడ్ మహానాడులోనూ కార్యకర్తలే అసలైన నాయకులని తీర్మానం చేయడం దీనికి నిదర్శనం. దీనికి భిన్నంగా, వైసీపీలో అధికారం మొత్తం ఒకే వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమై ఉంది. అక్కడ ఎలాంటి చర్చలు ఉండవు. నిర్ణయాలు ప్రకటిస్తారు. అమలు చేయాలంతే.
నిర్ణయాధికారంలో సజ్జల హవా
వైసీపీలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదు అనడానికి పార్టీ అంతర్గత వ్యవహారాలే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, అన్ని కీలక నిర్ణయాలు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ఒకరిద్దరు వ్యక్తుల చుట్టూనే తిరుగుతాయి. అసెంబ్లీని బహిష్కరించాలన్న నిర్ణయం తీసుకోవడానికి ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు. అదే సమయంలోఓటమికి సమీక్ష కూడా చేసుకోలేదు. నేతలకు పదవులు ఉన్నా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే లేదా కనీసం గళం విప్పే అవకాశం లేకపోవడం ఆ పార్టీలో సర్వసాధారణం. ఈ హైకమాండ్ సంస్కృతి వల్ల సీనియర్ నేతలు సైతం నిస్సహాయ స్థితిలో ఉండిపోయారనేది అందరికీ తెలిసిన వాస్తవం.
ప్లీనరీ అంటే కేవలం జగన్ ప్రసంగమేనా ?
సాధారణంగా పార్టీ ప్లీనరీ సమావేశాలు అంటే విధానపరమైన నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికలు, లోపాలను సరిదిద్దుకునే వేదికలు కావాలి. కానీ వైసీపీ ప్లీనరీలలో కేవలం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం చేయడం, మిగిలిన వారు దానిని వినడం తప్ప కార్యకర్తలతో చర్చలు ఉండవనే విమర్శ ఉంది. గతంలో చివరి సారిగా ప్లీనరీని పెట్టింది తనను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి.. తన తల్లిని గౌరవ అధ్యక్షురాలిగా తొలగించడానికే. రాజకీయ పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే అవి వ్యక్తిగత ఆస్తులు గా కాకుండా, ప్రజల గొంతుకలుగా మారాలి. కానీ వైసీపీలో జగన్ ప్రసంగమే పార్టీ సిద్ధాంతం అనుకుంటారు.
ప్రజాస్వామ్య పార్టీలకే భవిష్యత్తు
ప్రజలకు జవాబుదారీగా ఉండటమే కాకుండా, తన సొంత కార్యకర్తలకు జవాబుదారీగా ఉండే పార్టీలే సుస్థిరమైన రాజకీయాలను అందించగలవు. టీడీపీలో అంతర్గత ఎన్నికలు, కమిటీల నియామకం ఒక పద్ధతి ప్రకారం సాగుతాయి. అయితే, వైసీపీలో ఎన్నికలు లేని నియామకాలు, ప్రశ్నించే అవకాశం లేని నిర్మాణం వల్ల పార్టీ కేడర్లో నైతిక స్థైర్యం తగ్గుతోంది. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యాన్ని మర్చిపోతే, అది కాలక్రమేణా ప్రజలకు కూడా దూరమవుతుందని తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
