తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ డీఎంకే విజయాన్ని ఊహించాయి. కానీ ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం.. హంగ్ ను అంచనా వేసింది. విజయ్ టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చింది. అదే జరిగింది. అయితే డీఎంకే కూడా.. టీవీకేతో పోటాపోటీగా ఉంటుందని వేసిన అంచనాలు మాత్రం తప్పాయి. అన్నాడీఎంకే దారుణంగా దెబ్బతింటుందని అంచనా వేశారు. కానీ అన్నాడీఎంకే తన బలాన్ని పెంచుకుంది. దారుణంగా దెబ్బతిన్నది మాత్రం డీఎంకేనే.
అత్యధిక ఎగ్జిట్ పోల్స్ డీఎంకే కూటమి సులువుగా గెలుస్తుందని లేదా గట్టి పోటీ ఇస్తుందని పేర్కొన్నాయి. కానీ ఫలితాల్లో డీఎంకే అనూహ్యంగా మూడో స్థానానికి పడిపోయి దారుణంగా దెబ్బతిన్నది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను పసిగట్టడంలో చాలా సంస్థలు విఫలమయ్యాయి. స్టాలిన్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి నేరుగా విజయ్ వైపు మళ్లడం, క్షేత్రస్థాయిలో డీఎంకే ఓటు బ్యాంకు భారీగా చీలిపోవడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, అన్నాడీఎంకే విషయంలోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఆ పార్టీ దారుణంగా దెబ్బతింటుందని, విజయ్ ధాటికి ఉనికిని కోల్పోతుందని సర్వేలు పేర్కొన్నాయి. కానీ కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం అన్నాడీఎంకే తన పట్టును నిరూపించుకుంటూ రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో , పశ్చిమ తమిళనాడులో ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారు. సర్వేలు ఊహించిన దానికంటే అన్నాడీఎంకే మెరుగైన స్థానాల్లో ముందంజలో ఉండటం విశేషం.
ఈ ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థల విశ్వసనీయతపై మరోసారి చర్చకు దారితీశాయి. యాక్సిస్ మై ఇండియా హంగ్ అసెంబ్లీని, టీవీకే ప్రభంజనాన్ని ముందుగానే పసిగట్టినా.. డీఎంకే, అన్నాడీఎంకేల బలాబలాల విషయంలో మాత్రం పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేకపోయింది. తమిళనాడు ఓటరు తన మనసులోని మాటను సర్వేలకు దొరకకుండా కేవలం బ్యాలెట్ బాక్సులకే పరిమితం చేశారని అనుకోవచ్చు.
