తమిళనాడులో విజయ్ హవా కనిపిస్తోంది కానీ.. అది మెజార్టీ మార్క్ దగ్గరకు వచ్చేలా లేదు. మ్యాజిక్ మార్క్ 118కి కనీసం పది నుంచి పదిహేను స్థానాలు లోటు పడే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారన్నది కీలకం. డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, పీఎంకే, లెఫ్ట్ పార్టీలు విజయ్ వైపు వెళ్తే ప్రభుత్వం సులువుగా ఏర్పడుతుంది. లేకపోతే.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు గందరగోళంలో పడుతుంది.
ప్రస్తుత సమీకరణాల ప్రకారం, అన్నాడీఎంకే రెండో స్థానంలో ఉండగా, అధికార డీఎంకే కూటమి మూడో స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మిత్రపక్షాల మద్దతు అనివార్యమైంది. ఒకవేళ డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, పీఎంకే , లేదా లెఫ్ట్ పార్టీలు తమ స్వంత అజెండాతో విజయ్ వైపు మొగ్గు చూపితే సమీకరణాలు సులభమవుతాయి. ఈ కూటమి పార్టీలు కలిసి పది నుంచి పదిహేను సీట్లు గెలిచే అవకాశం ఉంది.
డీఎంకే లేదా అన్నాడీఎంకే వంటి ద్రవిడ దిగ్గజాలు విజయ్ పార్టీతో నేరుగా చేతులు కలిపేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ ఇప్పుడు విజయ్‌కు మద్దతు ఇస్తే, భవిష్యత్తులో తమ పార్టీల ఉనికి దెబ్బతింటుందనే భయం ఆ పార్టీలను వెంటాడుతోంది. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం గా ప్రకటించినందున ఆ పార్టీలే ఆయనకు మద్దతు ఇవ్వడం అంటే తమ స్వంత ఓటు బ్యాంకును ఆయనకు అప్పగించడమేనని నేతలు భావిస్తున్నారు.
ఈ గజిబిజి ట్రెండ్స్ మధ్య చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ విజయ్ కి సరిపడా మద్దతు లభించకపోతే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేదా కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద తమిళనాడులో దశాబ్దాల పాటు సాగిన రెండు పార్టీల రాజకీయాలకు తెరపడి, ఒక నూతన , అనిశ్చిత రాజకీయ శకం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.
