విజయ్ సినిమా ‘జననాయగన్’ సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా. అయితే రకరకాల కారణాల వల్ల ఆలస్యమైంది. తమిళ నాట ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల చేస్తే, అది విజయ్ పొలిటికల్ కెరీర్‌కి ప్లస్ అవుతుందని భావించారు. కానీ అదీ జరగలేదు. ఈ సినిమాలోని కొన్ని సీన్లు లీక్ అవ్వడంతో.. కలవరానికి గురయ్యారు. ఎన్నికలు పూర్తయినా ఈ సినిమాకి మోక్షం కలగలేదు. దాంతో ‘జననాయగన్’ ఫేడవుట్ అయిపోతుందన్న భయం ఏర్పడింది. మరోవైపు అనుకొన్న సమయానికి ఈ సినిమా విడుదల చేయకపోవడంతో ఓటీటీలు తమ ఆఫర్ ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించాయి. అలా.. ఈ సినిమాకు అన్ని వైపుల నుంచీ ఆటంకాలే ఎదురయ్యాయి.
అయితే ఇప్పుడు తమిళనాట సమీకరణాలు మారాయి. అక్కడ రాజకీయ ప్రభంజనం సృష్టించాడు విజయ్. తన పార్టీని తొలిసారి ఎన్నికల్లో దింపి, అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నాడు. తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నాడు. సీఎం అయిన తరవాత ‘జననాయగన్’ సినిమా రిలీజ్ అవ్వడం ఖాయం. అప్పుడు ఆ సినిమాకొచ్చే హైప్, క్రేజ్… మాటల్లో చెప్పలేనిది. అసలు టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లు కిక్కిరిసిపోవడం, కనకవర్షం కురవడం గ్యారెంటీ. ఎన్నికల ముందు విడుదల చేస్తే ఫలితం ఎలా ఉండేదో ఊహించలేం కానీ, ఇప్పుడు మాత్రం రికార్డుల దుమ్ము దులపడం ఖాయం. ఈ సినిమాతో భారీగా నష్టపోతామని భావించిన కెవీఎన్ సంస్థ… ఇప్పుడు తమ హీరో సీఎం కావడంతో సంబరాలు చేసుకొంటోంది. జననాయగన్ కి ఏదైతే శాపంగా అనుకొన్నారో, ఇప్పుడు అదే వరంగా మారిపోయింది.
తెలుగులో విజయవంతమైన ‘భగవంత్ కేసరి’ కి ఇది రీమేక్. ఈ సినిమాలోని పాయింట్ తీసుకొనే కథని కాస్త కొత్తగా అల్లారు. దర్శకత్వం చేసే అవకాశం అనిల్ రావిపూడికే దక్కింది. కానీ… ఆ సమయంలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం ఆ ఛాన్స్ వదులుకొన్నారు. అనిల్ రావిపూడి గనుక ఈ సినిమా చేసుంటే.. ఇప్పుడు ఆయన పేరు కూడా తమిళ నాట మార్మోగిపోయేది.