తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ద్రవిడ రాజకీయాల్లో పెను సంచలనాన్ని నమోదు చేశాయి. విజయ్ టీవీకే సాధించిన ఫలితాలే కాకుండా.. అన్నాడీఎంకే సాధించిన ఫలితాలు కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అత్యంత బలమైన నాయకురాలు జయలలిత లేకపోవడం, ఎడప్పాడి పళనిస్వామి కి చరిష్మా లేదనే విమర్శలు, అలాగే బీజేపీతో పొత్తు వల్ల నష్టపోతారనే ప్రచారాలన్నింటినీ పటాపంచలు చేస్తూ అన్నాడీఎంకే మళ్ళీ ఘనంగా ఉనికి చాటింది. తాజా ట్రెండ్స్ ప్రకారం, అన్నాడీఎంకే 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండి రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనంలో అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోతుందని భావించిన రాజకీయ పండితుల అంచనాలు తలకిందులయ్యాయి.
విజయ్ తన ప్రచారంలో అధికార డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేసినా, అన్నాడీఎంకేను మాత్రం పెద్దగా టార్గెట్ చేయలేదు. అయితే, ఈ మౌనం అన్నాడీఎంకేకు మేలు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈపీఎస్ తన పరిపాలనా అనుభవాన్ని, క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన క్యాడర్ వ్యవస్థను సమర్థవంతంగా వాడుకున్నారు. జయలలిత లేని లోటును తన క్రమశిక్షణతో, ఓర్పుతో భర్తీ చేస్తూ పార్టీ క్యాడర్ చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవడంలో ఆయన విజయం సాధించారు. ఫలితంగా అన్నాడీఎంకే తన సంప్రదాయ ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడమే కాకుండా, పట్టణాల్లో సైతం టీవీకేకు గట్టి పోటీని ఇచ్చింది.
మరోవైపు, అధికారంలో ఉండి కూడా డీఎంకే దారుణమైన వైఫల్యాన్ని చవిచూసింది. ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే దుస్థితికి చేరుకోవడం స్టాలిన్ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ డీఎంకేకే పట్టం కట్టగా, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు ద్రవిడ మోడల్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా తన సొంత నియోజకవర్గంలో వెనుకంజలో ఉండటం డీఎంకే పతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి చూస్తే, తమిళనాడులో అన్నాడీఎంకే ఓటు బ్యాంకు ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతోంది. విజయ్ పార్టీ వైపు మళ్ళిన ఓట్లన్నీ దాదాపు డీఎంకే ఖాతాలోవేనని, అన్నాడీఎంకే ఓటర్లు మాత్రం తమ పార్టీకే కట్టుబడి ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అన్నాడీఎంకే పని అయిపోయింది అన్న విమర్శకులకు పళనిస్వామి తన గెలుపుతో బలమైన సమాధానం ఇచ్చారు. రాబోయే కాలంలో టీవీకే – అన్నాడీఎంకే మధ్యనే అసలైన రాజకీయ పోరు సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
