కమర్షియల్ సినిమాలు తీయడం అనుకున్నంత ఈజీ కాదు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక పెద్ద స్టార్ హీరోతో కమర్షియల్ సినిమా రూపొందించడం అంటే అది మరింత పెద్ద ఛాలెంజ్. ఏ కథ చెప్పాలి? ప్రేక్షకులను ఎలా ఆశ్చర్యపరచాలి? హీరో ఇమేజ్ను ఎలా కొత్తగా చూపించాలి? ఇలాంటి అంశాలకే దర్శకులు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. అయితే ఈ జోనర్లో కూడా ప్రతి సారి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ ప్రేక్షకులను థియేటర్లలో మైమరపించే దర్శకులు ఉన్నారు. ఆ జాబితాలో ప్రశాంత్ నీల్ పేరు ఖచ్చితంగా ముందుంటుంది.
చాలామంది కమర్షియల్ సినిమాకి ఒక ఫార్ములా ఉందని భావిస్తారు. పాటలు, ఫైట్లు, హీరో ఎలివేషన్స్ ఉంటే చాలు కమర్షియల్ సినిమా అయిపోతుందని అనుకుంటారు. కానీ అది అసలు నిజం కాదు. ‘శివ’, ‘మగధీర’, ‘బాహుబలి’, పుష్ప, ‘కేజీఎఫ్’, తాజాగా వచ్చిన ‘దురంధర్’.. ఈ సినిమాలు అన్నీ కమర్షియల్ సినిమాలే. కానీ వాటిలో ఒక్క సినిమా మరో సినిమాతో పోలిక ఉండదు. ప్రతి సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త భావోద్వేగాన్ని, కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించింది. అదే అసలైన కమర్షియల్ సినిమా లక్షణం.
ప్రశాంత్ నీల్ కెరీర్‌ను గమనిస్తే ఆయన ఎప్పుడూ ప్రేక్షకులకు ఐడియా వున్న ప్రపంచాన్నే తీసుకుని, దాన్ని ఎవరూ ఊహించని స్థాయిలో చూపించారు. ‘కేజీఎఫ్’కి ముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి తెలుసు. కానీ ఆ ప్రపంచాన్ని అంత భారీగా, అంత స్టైలిష్‌గా ఎవరూ ఆవిష్కరించలేదు. ‘సలార్’లో రెండు చీకటి సామ్రాజ్యాల మధ్య యుద్ధాన్ని ఆయన చూపించిన తీరు కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ విషయంలో ప్రశాంత్ నీల్ మరో అడుగు ముందుకేసినట్టు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే ఆయన ఈసారి ఓపియం ట్రేడింగ్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారని స్పష్టమైంది. ఇప్పటివరకు మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సినిమాలో ఈ అంశాన్ని ఇంత భారీ స్థాయిలో ఎవరూ టచ్ చేయలేదు. గ్లింప్స్‌లో కేవలం నాలుగు నిమిషాల్లోనే ఆయన ప్రేక్షకుడిని ఆ ప్రపంచంలోకి లాక్కెళ్లారు. ఎలాంటి కథ చెప్పబోతున్నారు? ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండబోతోంది? అనే విషయాన్ని ఒక ఐడియాగా చూపించారు.
ఇక్కడ ప్రశాంత్ నీల్ కథల ఎంపిక గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఇప్పుడు ప్రేక్షకులు కొరుకునే కథనే పట్టుకున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు హిస్టరీ, రియాలిటీ, ఫిక్షన్ కలిసిన కథల్ని ఎక్కువగా ఆదరిస్తున్నారు. ‘దురంధర్’లో ఆదిత్య ధర్ నిజ జీవిత జియోపాలిటికల్ అంశాలను తీసుకుని కమర్షియల్‌గా అద్భుతంగా చెప్పగలిగారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఓపియం వార్స్ వంటి చారిత్రక నేపథ్యాన్ని ఎంచుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది.
ఓపియంకి రక్తంతో రాసిన చరిత్ర ఉంది. పాపావర్ సోమ్నిఫెరం అనే గసగసాల మొక్కల నుంచి సేకరించే ఈ మత్తు పదార్థం సామ్రాజ్యాల మధ్య యుద్ధాలకు కారణమైంది. ఇందులో మార్ఫిన్, కొడీన్ వంటి ఆల్కలాయిడ్స్ ఉంటాయి. నొప్పి తగ్గించే మందుగా మొదలైన ఓపియం… తర్వాత ప్రపంచాన్ని వణికించిన ప్రమాదకర డ్రగ్స్‌కు మూలంగా మారింది. దీనిని శుద్ధి చేసి హెరాయిన్ వంటి ప్రమాదకర మత్తు పదార్థాలను తయారు చేస్తారు. కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఓపియం అత్యంత ప్రమాదకర మత్తు పదార్థాల్లో ఒకటి. దీనికి వ్యసనపడే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో, దీని సాగు నుంచి వినియోగం వరకు అంతా ప్రభుత్వ నియంత్రణలోనే జరుగుతుంది. అనుమతి లేకుండా పండించడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరం.
ఈ నల్లమందు కోసం బ్రిటన్, చైనా మధ్య యుద్ధాలు జరిగాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తయారు చేసిన ఓపియంను చైనాకి తరలించేది. చైనా ప్రజలు భారీ స్థాయిలో ఈ మత్తుకు బానిసలయ్యారు. దాంతో చైనా ప్రభుత్వం ఆ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు బ్రిటిష్‌లతో యుద్ధం చేసింది. వీటినే చరిత్రలో “ఓపియం వార్స్” అని పిలుస్తారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు కూడా నల్లమందు వ్యాపారంపై బ్రిటిష్ ఇండియా గుత్తాధిపత్యం కొనసాగింది. ఈ చారిత్రక నేపధ్యంతో అమితవ్ ఘోష్ ‘సీ ఆఫ్ పాపీస్’ అనే ప్రసిద్ధ నవల రాశారు. నల్లమందు చరిత్ర గురించి చాల ఆసక్తికరమైన అంశాలు ఇందులో వున్నాయి.
ఇప్పుడు అలాంటి భారీ చారిత్రక నేపథ్యాన్ని ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లాంటి స్టార్‌తో కలిపి కమర్షియల్ యాక్షన్ డ్రామాగా రూపొందించబోతుండటం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా గ్లింప్స్‌లో పాత్రలను పరిచయం చేసిన తీరు చూస్తుంటే ఆయన కేవలం స్టైలిష్ యాక్షన్‌కే పరిమితం కాలేదని, బలమైన చారిత్రక ఆధారాలతో కథను అల్లుకున్నట్టు అనిపిస్తోంది.
ప్రేక్షకులు ఏమి చూడాలనుకుంటున్నారో ప్రశాంత్ నీల్‌కు క్లారిటీ ఉంది. అదే సమయంలో ప్రేక్షకులు ఊహించని ప్రపంచాన్ని చూపించడంలో ఆయనకు ప్రత్యేకమైన విజన్ ఉంది. ఇప్పుడు ‘డ్రాగన్’ గ్లింప్స్ చూసిన తర్వాత అందరిలో కథపై ఆసక్తి పెరిగింది. పైగా బ్రిటిష్ చైనా వార్స్ ని గుర్తు చేస్తూ సినిమాకి ‘డ్రాగన్’ అని పేరు పెట్టారు. చరిత్రలో నల్లమందు యుద్ధాలు జరిగాయి. ప్రశాంత్ నీల్ ఎంచుకున్న కథలోనే యుద్ధం సహజంగా ఇమిడిపోయింది. ‘దురంధర్’కి కుదిరినట్టే బలమైన ఎమోషన్ కూడా ‘డ్రాగన్’కి కుదిరితే మాత్రం సినిమాకు తిరుగుండదు.
