purushah telugu movie review
తెలుగు360 రేటింగ్: 2.25/5
భార్యా బాధితుల గురించి ఎన్ని జోకులు, కథలు చెప్పుకొన్నా మరోటి వినాలనే అనిపిస్తుంటుంది. ఎందుకంటే అది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. ముఖ్యంగా మగాళ్లకు. ఆడాళ్ల అహంకారం వల్లో, అనుమానాల వల్లో బలైపోయిన మగాళ్ల కథలు, వెతలతో చాలా సినిమాలొచ్చాయి. దాన్ని వినోదాత్మకంగా చెప్పిన కథలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘ఎఫ్ 2’ లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు. `పురుషః` కూడా భార్యాబాధితుల కథే. దీన్ని కూడా కామెడీ కోణంలోనే చెప్పాలనుకొన్నారు. మరి ఈ ప్రయత్నం ఏమేరకు ఆకట్టుకొంది? ఎన్ని నవ్వులు పండాయి?
బండ (పవన్ కల్యాణ్), కిస్ (వెన్నెల కిషోర్), జంపు (కసిరెడ్డి), బొగ్గు (సప్తగిరి) చిన్నప్పటి నుంచీ స్నేహితులు. కిస్ మినహాయించి మిగిలిన ముగ్గురూ పెళ్లిళ్లు చేసుకొంటారు. అప్పటి నుంచే వాళ్ల జీవితాలు పూర్తిగా భార్యల అధీనంలోకి వెళ్లిపోతాయి. వాళ్ల భార్యలకు మొగుళ్లంటే లెక్కలేదు. పైగా అనుమానం. దాంతో రాచి రంపాలు పెడుతుంటారు. ఓరోజు కిస్ కి కూడా పెళ్లి కుదురుతుంది. స్నేహితులు ఆ పెళ్లికి హాజరవుతారు. అక్కడ బండ, జంపు, బొగ్గుల గురించి.. ఇంకొన్ని కఠినమైన నిజాలు భార్యలకు తెలుస్తాయి. అవేంటి? ఆ తరవాత జరిగిన పరిణామాలేంటి? ఆ నిజాల వల్ల ఈ ముగ్గురి జీవితంలో మొదలైన అలజడి… వాళ్లనీ, వాళ్ల కాపురాల్నీ ఏ తీరానికి చేర్చాయి? అనేదే మిగిలిన కథ.
ఓరకంగా ఇది భర్తల బయోపిక్‌లో కొన్ని పేజీలు అనుకోవొచ్చు. ఎందుకంటే పెళ్లయిన ప్రతీ మగాడి జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. చీటికీ మాటికీ భార్యాభర్తలు కొట్టుకోడం, కోర్టు మెట్లు ఎక్కడం చూస్తూనే ఉంటాం. ఈ కథ కూడా అలాంటిదే. భార్యా భర్తల మధ్య పేచీలు, రాజీలతో మొదలైన ఈ కథ ‘భార్యల్ని యుద్దంతో కాదు.. ప్రేమతో గెలవాలి’ అనే నీతి వాక్యంతో ముగుస్తుంది. మధ్యలో జరిగేదంతా సరదా తంతే. అది కొన్నిసార్లు `సాగదీత`లా అనిపించింది. మరికొన్ని సార్లు నవ్వించింది. చాలాసార్లు.. వృధా ప్రయాస అనిపించింది.
కథ, అందులో మగాళ్ల ప్రవర్తన, ఆడాళ్ల దౌర్జన్యం ఇవన్నీ చూస్తుంటే ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘ఎఫ్ 2’లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. కోర్టులో విడాకుల కోసం వెళ్లిన ముగ్గురు మగాళ్లు అక్కడి న్యాయమూర్తి (వీటీవీ గణేష్)కి తమ కథ చెప్పుకోవడం మొదలెడతారు. అక్కడ్నుంచి సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్తుంది. భర్తల కథ, వ్యధ మనకేం కొత్తగా అనిపించదు. ఆ సన్నివేశాలన్నీ సో.. సోగా సాగిపోయాయి. అయితే వెన్నెల కిషోర్ రాకతో కామెడీ బండి కాస్త కదిలింది. ఇంట్రవెల్ కి ముందు కొన్ని సన్నివేశాలు రక్తి కట్టాయి. అదంతా వెన్నెల కిషోర్ టైమింగ్ వల్లే. వెన్నెల కిషోర్ ఎప్పుడైతే మాయం అయిపోయాడో, అక్కడ కామెడీకి కూడా పుల్ స్టాప్ పడిపోయింది. సెకండాఫ్ లో సగం ఫ్రెంచ్ అమ్మాయితో సాగిన ప్రేమ కథ చూపించారు. ఆ సన్నివేశాలు ఏమాత్రం రక్తి కట్టలేదు. భార్యలు, భర్తలు తమ కాస్ట్యూమ్స్ మార్చుకొని చేసుకొనే ఫైటింగులు మొదట్లో ఓకే అనిపిస్తాయి. రాను రాను.. అవి కూడా బోర్ కొట్టిస్తాయి. చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని ప్రభావం కూడా అంతంత మాత్రమే. పమ్మిసాయి ఎపిసోడ్ మాత్రం కొంతలో కొంత బెటర్. ‘హోస్ హజ్జెండ్’ పాత్రని ఇంకొంచెం సాగదీసినా బాగుండేది అనిపించింది.
పవన్ కల్యాణ్ కి ఇదే తొలి సినిమా. నటన పరంగా ఓకే అనిపిస్తాడు. వెన్నెల కిషోర్ వల్ల కొన్ని సన్నివేశాలు పండాయి. సప్తగిరి సెటిల్డ్ గా నటించాడు. ఎక్కువ హడావుడి చేయకుండానే కామెడీ పండించాడు. తనని ఇలాంటి సెటిల్డ్ పాత్రల కోసం వాడుకొంటే మరిన్ని మంచి పాత్రలు తనకు దక్కే అవకాశం ఉంది. కసిరెడ్డి కి రాసుకొంటున్న క్యారెక్టర్లు రాను రాను రొటీన్ అయిపోతున్నాయి. ఈ విషయం ఈ నటుడు గుర్తుంచుకొంటే మంచిది. వీటీవీ గణేశ్ కూడా అంతే. తన మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ రాను రాను విసుగు తెప్పిస్తున్నాయి. ముగ్గురు అమ్మాయిలూ కొత్తవాళ్లే. వారి వారి పాత్రల్లో మెప్పించారు.
సినిమాలో క్వాలిటీ మేకింగ్ కనిపించింది. కథకు లోబడి బాగానే ఖర్చు పెట్టారు. పాటలు గుర్తు పెట్టుకొనే స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం కూడా అంతే. భార్యాబాధితుల కథని లైటర్ నోట్ లో చెప్పాలనుకొన్నాడు దర్శకుడు. అయితే.. ఈ డోసు సరిపోలేదు. ఇంకాస్త కామెడీ జోడిస్తే బాగుండేది. ఫస్టాఫ్‌లో కొన్ని ఎపిసోడ్లు నవ్విస్తాయి. వెన్నెల కిషోర్, సప్తగిరి కాస్త కాపు కాశారు. స్క్రిప్టు దగ్గరే ఇంకాస్త కష్టపడాల్సిన అవసరాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది.
purushah telugu movie review
తెలుగు360 రేటింగ్: 2.25/5
