మంచు ఫ్యామిలీ అంతా ఒక వైపు, మనోజ్.. లక్ష్మిలు మరో వైపు. ఈ ఇంటి గొడవలు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఓ దశలో… మీడియా అంతా మోహన్ బాబు ఇంటి ముందే ఉండేది. సినిమా స్క్రిప్టుకు మించి ట్విస్టులు, యాక్షన్ సినిమాకు మించిన గొడవలూ.. ఈ కుటుంబంలో కనిపించాయి. ఇప్పుడు ఆ గొడవలు సర్దుమణిగాయి కానీ, లోలోపల ఇంకా గ్యాప్ ఉంది. మనోజ్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఈ వ్యవహారంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు జర్నలిస్టులు. ఈసారీ అదే జరిగింది.
రేపు మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీ నాన్నగారితో గొడవలు సర్దుమణిగినట్టేనా’ అని అడిగితే… `అది ఎవర్ని అడగాలో మీకు తెలుసు. ఆయన్నే అడగండి. వెళ్లేటప్పుడు మైకు తీసుకెళ్లొద్దు. తీసుకెళ్లినా హెల్మెట్ తప్పనిసరి..’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఆ గొడవల్లో ఓ జర్నలిస్టుమీద మోహన్ బాబు మైకు విసిరేయడం, ఆ తరవాత పెద్ద రాద్ధాంతం జరగడం, జర్నలిస్టుకి మోహన్ బాబు క్షమాపణలు చెప్పడం… ఈ ఎపిసోడ్ గుర్తుండే ఉంటుంది. దానిపైనే మనోజ్ వేసిన సెటైర్ ఇది. ”తన తండ్రి ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని.. ఇప్పుడూ ఉన్నాయని” ఈ సందర్భంగా మనోజ్ పేర్కొనడం కొసమెరుపు. ‘కన్నప్ప’ రిలీజ్ సమయంలో కూడా.. మనోజ్ సినిమా చూసి పాజిటీవ్ రివ్యూ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మనోజ్‌కి ఫ్యామిలీ ఎటాచ్మెంట్ ఎక్కువ. అందరితోనూ కలిసి ఉండాలనుకొంటుంటారు. కానీ పరిస్థితులే అందుకు అనుకూలించడం లేదు.
