గతంలో జగన్ రెడ్డి తరపున ఢిల్లీలో పనులు చక్కబెట్టినప్పుడు విజయసాయిరెడ్డి ఎవరు ప్రధాన పదవుల్లోకి వస్తారో అంచనా వేసి.. వారి వద్దకు ఓ బోకేనో.. గిఫ్టో పట్టుకు వెళ్లి ముందస్తుగా అభినందనలు తెలిపి ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేసేవారు. వారికి పదవులు వచ్చాక చేసే హడావుడి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు జగన్ రెడ్డికి అలాంటి పరిస్థితి వచ్చింది. తమిళనాడు నేతలతో జగన్ ఉన్న ఫోటోలు పెట్టి మా అన్న చాలా క్లోజ్ అని చెప్పుకుంటున్నారు.
తమిళనాడులో జగన్ రెడ్డికి మంచి మిత్రుడు స్టాలిన్ అని అందరికీ తెలుసు. గతంలో జగన్ ప్రమాణ స్వీకారానికి ఆయన వచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ స్టాలిన్ పరిస్థితి బాగోలేదని ప్రచారం జరగడం.. విజయ్ ప్రభంజనం అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో .. విజయతో జగన్ టచ్‌లో ఉన్నారని వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి లండన్ లో ఉన్నారు. ఫలితాలు వచ్చాక మరో పది రోజుల వరకూ రారు. అంటే అప్పటికీ ప్రమాణ స్వీకారం కూడా అయిపోతుంది. మరి టచ్‌లో ఉండి ఏం చేస్తారో…. ఒక వేళ హంగు వస్తే.. ఎమ్మెల్యేలను రిసార్టు కు తరలించడానికి సాయం చేస్తారా.. అంటే అదేమీ ఉండదు.. కేవలం గెలిచే వాళ్లు మా అన్నకు క్లోజ్ అని చెప్పుకోవడమే అన్నమాట.
ఇందు కోసం ఇటీవల ఓ పెళ్లికి వెళ్లినప్పుడు ర్యాండమ్ గా స్టాలిన్, విజయ్ వంటివారితో దిగిన ఫోటోలు ఉన్నాయి. వాటిని చూపించి మా అన్న..విజయ్‌కు బాగా క్లోజ్ అని ప్రచారం చేసుకుంటారు. అయినా జగన్ రెడ్డికి ఇలా .. గెలిచే వాళ్లు..గెలవబోయే వాళ్లు.. గెలుస్తారని అనుకునేవాళ్లంతా క్లోజ్ అని చెప్పుకోవడమే గొప్ప అని ఎందుకనుకుంటున్నారో వారికే తెలియాలి!
