దేశం చూపు ఐదు రాష్ట్రాల వైపు ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నెల రోజులకు పైగా సాగిన హోరాహోరీ ప్రచారం, రికార్డు స్థాయి పోలింగ్ తర్వాత.. ఈ ఐదు ప్రాంతాల ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈ ఫలితాలు దేశ రాజకీయ భవిష్యత్తును, ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్రను నిర్ణయించే లిట్మస్ టెస్ట్ గా మారాయి.
బెంగాల్ కోటపై ఎవరు జెండా ఎగురవేస్తారు?
పశ్చిమ బెంగాల్లో ఈసారి పోరు పతాక స్థాయికి చేరింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన హ్యాట్రిక్ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డగా, ఆమె కోటను బద్దలు కొట్టాలని బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ, 89 లక్షల మంది ఓటర్ల తొలగింపుపై దీదీ చేసిన ఆరోపణలు, మరోవైపు నందిగ్రామ్ తరహాలో భవానీపూర్‌లోనూ సంచలనం సృష్టిస్తానన్న సువేందు అధికారి సవాళ్ల మధ్య బెంగాల్ తీర్పుపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
తమిళనాడులో త్రిముఖ పోరు – విజయ్ ఎంట్రీతో సమీకరణాల మార్పు
తమిళనాడులో ఈసారి ఎన్నికలు అత్యంత ప్రత్యేకంగా మారాయి. అధికార డీఎంకే కూటమి, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి మధ్యే కాకుండా.. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తుందన్నది కీలకంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల హక్కులు, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలు ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించాయి. స్టాలిన్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్నది నేడు తేలనుంది.
కేరళలో ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ ఆశలు.. అస్సాంలో బీజేపీ శతకం
సాధారణంగా ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే కేరళలో, ఈసారి లెఫ్ట్ ఫ్రంట్ తన వరుస విజయాల పరంపరను కొనసాగిస్తుందా? లేక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పుంజుకుంటుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉంది. పుదుచ్చేరిలో ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ నాలుగోసారి అధికారాన్ని ఆశిస్తోంది.
కౌంటింగ్ ఏర్పాట్లు – భద్రతా వలయంలో కేంద్రాలు:
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఈవీఎంలను తెరవనున్నారు. మధ్యాహ్నం కల్లా స్పష్టమైన ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంది. బెంగాల్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. సెక్షన్ 8బి నోటీసుల రగడ, కోర్టు తీర్పుల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో టెన్షన్ పీక్స్‌కు చేరింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుకే పరిమితం కాకుండా, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు దిక్సూచిగా నిలవనున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ బలాన్ని పెంచుకుంటాయా.. లేక ప్రాంతీయ శక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటాయా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
