గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న విప్లవాత్మక ఆలోచనలు పల్లెల్లో పారిశుధ్య విప్లవాన్ని తీసుకువస్తున్నాయని ఒలింపిక్ మెడలిస్ట్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు ప్రశంసించారు . పవన్ కళ్యాణ్ గారి 20 నెలల పాలనపై స్పందిస్తూ ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో మ్యాజిక్ డ్రెయిన్స్ వంటి వినూత్న కార్యక్రమాలు గ్రామీణ మురుగునీటి సమస్య పరిష్కారంలో గేమ్ ఛేంజర్ గా మారుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మెజారిటీ ప్రజలకు పారిశుధ్యం అనేది ఒక పెద్ద సవాలుగా ఉంటుందని, సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటారని సింధు పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని ఆమె వివరించారు. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేసి, క్షణాల్లో భూగర్భ జలంగా మార్చడం ద్వారా దుర్వాసన, మురుగు నిల్వ వంటి సమస్యలను ఇవి నివారిస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
ఈ మ్యాజిక్ డ్రెయిన్ల వల్ల పారిశుధ్యం మెరుగుపడటమే కాకుండా, ఆర్థికంగా కూడా ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతోందని సింధు గుర్తు చేశారు. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే, ఈ వినూత్న విధానం వల్ల దాదాపు 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా అవుతోందని ఆమె వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి ముందుచూపుతో కూడిన దార్శనిక కార్యక్రమాలు చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు.
శనివారం స్వచ్ఛరథాలకు సినీ నటుడు నాని మద్దతు తెలపగా, ఆదివారం మ్యాజిక్ డ్రెయిన్ల ప్రాముఖ్యతను వివరిస్తూ సింధు ముందుకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ దార్శనికతతో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆమె తన సందేశంలో ఆకాంక్షించారు.
