బండ్ల గణేష్ ఇంట్లో శుభకార్యం జరిగింది. కుమార్తె నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. అయితే ఆషామాషీగా జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ ప్రముఖులంతా హాజరయ్యారు. ఏపీ చంద్రబాబు, తెలంగాణ డిప్యుటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, హీరోలు అంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబసమేతంగా వచ్చారు. అందర్నీ బండ్ల గణేష్ దగ్గరుండి ఆహ్వానించి కుమార్తెకు..కాబోయే అల్లుడికి ఆశీర్వచనాలు ఇప్పించారు.
ఇంతకీ ఈ బండ్ల గణేష్ ఎవరు … ఓ ఎమ్మెల్యే కాదు.. ఓ ఎంపీ కాదు. ఏ పార్టీ నేత కూడా కాదు. కాంగ్రెస్ లో ఉండరు.. టీడీపీలో ఉండరు..కానీ అందరికీ ఎవరికి ఎలా కావాలంటే అలా పొగడ్తలు కురిపించి..త అందరికీ శ్రేయోభిలాషిలా ఉంటారు . అందుకే అందరివాడు అనుకోవచ్చేమో. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు వచ్చారు. చివరికి వైసీపీ నుంచి కూడా వచ్చారు. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శీను లాంటి వాళ్లు వచ్చారు.
బండ్ల గణేష్ వ్యవహారాలపై చాలా వివాదాలు ఉన్నాయి. చెక్ బౌన్స్ కేసులు, నిర్మాతగా డబ్బులు ఎగ్గొట్టిన కేసులు, సోషల్ మీడియాలో బెదిరింపులు, చివరికి నౌహిరా షేక్ అనే ఆమెతోనూ లావాదేవీల గొడవలు.. కేసుల దాకా వెళ్లాయి. అయితే అన్నింటినీ తనదైన శైలిలో చక్కదిద్దుకుంటూ వస్తున్నారు. సినిమాల్లో కమెడియన్ అయినా.. వ్యవహారం కాస్త కామెడీగా కనిపించినా బండ్ల గణేష్ పలుకుబడి మాత్రం నెక్ట్స్ లెవల్ అని మరోసారి నిరూపించుకున్నారు.


