తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో ఈవీఎంల ఫలితాల్లో ట్రెండ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. హంగ్ అసెంబ్లీ ఖాయంగా కనిపిస్తోంది. ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ టీవీకే మొదటి స్థానంలో ఉంటుంది. రెండో స్థానంలో అన్నాడీఎంకే ఉంటుంది. భారీగా నష్టపోయింది మాత్రం డీఎంకేనే. ఆ పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి కూడా మూడోస్థానానికి పరిమితమవుతోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓట్ల లెక్కింపులో ద్రవిడ రాజకీయాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్లలో డీఎంకే కొంత ఆధిక్యం కనబరిచినప్పటికీ, ఈవీఎం రౌండ్లు మొదలైనప్పటి నుంచి నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న ట్రెండ్స్ ప్రకారం, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని హంగ్ అసెంబ్లీ దిశగా రాష్ట్రం వెళ్తోంది.
విజయ్ పార్టీ టీవీకే అనూహ్యంగా మొదటి స్థానంలో కొనసాగుతోంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విజయ్ క్రేజ్ ఓట్లుగా మారిందని క్షేత్రస్థాయి సమాచారం చెబుతోంది. రెండో స్థానంలో ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే నిలవగా, అధికార డీఎంకే కూటమి ఊహించని రీతిలో మూడో స్థానానికి పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన డీఎంకేకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
ప్రధానంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సొంత నియోజకవర్గం కొలత్తూర్లో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు గట్టి పోటీ ఇస్తుండగా, పెరంబూర్ వంటి చోట్ల విజయ్ స్వయంగా ఆధిక్యంలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే సైతం గట్టి పోటీని ఇస్తున్నప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో విజయ్ పార్టీ కింగ్ మేకర్ పాత్రను దాటి ‘కింగ్’ స్థానానికి పోటీ పడుతుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
ప్రస్తుత ట్రెండ్స్ పరిశీలిస్తే, అధికార డీఎంకేకు వ్యతిరేకంగా వచ్చిన ఓట్లను టీవీకే, అన్నాడీఎంకే పంచుకున్నాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా యువ ఓటర్లు పూర్తిగా విజయ్ వైపు మొగ్గు చూపడం డీఎంకే పతనాన్ని శాసించినట్లు తెలుస్తోంది. సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడితే తప్ప, తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిపై స్పష్టత రాదు. ఏది ఏమైనా, విజయ్ రాకతో తమిళనాట ద్రవిడ కోట బీటలు వారుతోందని స్పష్టమవుతోంది.
