ఈయేడాది సంక్రాంతికి ‘రాజాసాబ్’ గా అభిమానుల ముందుకు వచ్చాడు ప్రభాస్. అయితే ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ప్రభాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని, నిరసననీ వ్యక్తం చేశారు. అయితే.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ఉండడంతో, వెంటనే ఆ గాయం నుంచి కోలుకొందాం అనుకొన్నారు. ‘ఫౌజీ’ ఈ యేడాది చివర్లో రావాలి. మేకర్స్ కూడా అదే విషయం చెబుతూ వచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. మిగిలిన షూటింగ్ కూడా శర వేగంగా ఫినిష్ చేయాలన్న లక్ష్యంతో చిత్రబృందం పని చేస్తోంది. అందుకే సెకండ్ యూనిట్ కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. కీలకమైన పోర్షన్ అంతా.. హను రాఘవపూడి నేతృత్వంలో పూర్తవుతుంది. ప్రాధాన్యత తక్కువ ఉన్న సీన్లు, ప్యాచ్ వర్క్ కి సంబంధించిన పనులు సెకండ్ యూనిట్ చూసుకొంటుంది.
షూటింగ్ పూర్తవ్వడం, పూర్తి కాకపోవడం `ఫౌజీ` సమస్య కాదు. ఈ యేడాది చివర్లో రిలీజ్ కాబట్టి కావాల్సినంత సమయం ఉంది. కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ ఈ సినిమాకు చాలా కీలకం. సీజీకి సంబంధించిన వర్క్ చాలా పెండింగ్ లో ఉంది. అవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. ఆర్, ఆర్, సౌండ్ డిజైనింగ్… వీటిపై చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. అందుకోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయన్న విషయంలో చిత్రబృందం దగ్గర క్లారిటీ లేదు. అందుకే రిలీజ్ డేట్ విషయంలో స్పష్టంగా చెప్పడం లేదు. ముందు ఓ డేట్ అనుకొని, ఆ సమయానికి విడుదల చేయాలనుకొంటే, టీమ్ పై ఒత్తిడి పడిపోతుంది. చెప్పిన సమయానికి రాకపోతే, ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ పడతారు. అందుకే రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఎటూ చెప్పలేకపోతున్నారు. ప్రభాస్ కూడా రిలీజ్ డేట్ విషయంలో కంగారు వద్దు అని నిర్మాతలకు గట్టిగా చెప్పేశాడట. రాజాసాబ్ ఫెయిల్ అయిన నేపథ్యంలో ఈ సినిమాని ఆయన ఇంకొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిచ్చింది. అందుకే నిర్మాతలు కూడా ఈ విషయంలో రాజీ పడకూడదనుకొంటున్నారు. షూటింగ్ అంతా అయిపోయిన తరవాత, జరిగిన వర్క్‌ని బట్టి, ఓ నిర్దారణకు వస్తారు. అప్పటి వరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.


