ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనల విషయలో యువ న్యాయవాదిని 24 గంటల పాటు పోలీసు కస్టడీకి ఆదేశించిన ఘటనను భారత బార్ కౌన్సిల్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. కేవలం ఒక ఉత్తర్వు ప్రతిని సమర్పించలేదనే సాంకేతిక కారణంతో, పదేపదే క్షమాపణలు చెబుతున్నా వినకుండా యువ న్యాయవాదిని జైలుకు పంపాలని చూడటం రాజ్యాంగ విలువలకే విరుద్ధమని మండిపడింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తూ, సదరు న్యాయమూర్తి జస్టిస్ టి. రాజశేఖరరావు తీరు న్యాయవ్యవస్థకు ఉండాల్సిన సంయమనాన్ని దెబ్బతీసిందని పేర్కొంది.
కోర్టు హాల్లో యువ న్యాయవాది నిస్సహాయంగా వేడుకుంటున్నప్పటికీ, కనికరం లేకుండా కస్టడీకి ఆదేశించడం వల్ల వృత్తిలోకి వస్తున్న యువత ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానం యొక్క గౌరవం అనేది న్యాయవాదులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా కాకుండా, వారి పట్ల చూపే నిష్పాక్షికత , కరుణ ద్వారానే పెరుగుతుందని బార్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో బి.సి.ఐ మూడు ప్రధాన డిమాండ్లను సి.జె.ఐ ముందు ఉంచింది. సదరు న్యాయమూర్తి నుండి వెంటనే న్యాయ విధులను ఉపసంహరించుకోవాలని, ఆయనను తక్షణమే సుదూర ప్రాంతంలోని మరేదైనా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. అంతేకాకుండా, కోర్టు నిర్వహణ , న్యాయమూర్తులకు ఉండాల్సిన ఆవశ్యక సంయమనంపై ఆయనకు ప్రత్యేక న్యాయ శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించడం గమనార్హం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లను నిశితంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇటువంటి ధోరణులు పునరావృతం కాకుండా కఠినమైన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది. న్యాయ వ్యవస్థలో ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడటంతో పాటు, బార్ స్వతంత్రతను రక్షించాల్సిన బాధ్యత అత్యున్నత ధర్మాసనంపై ఉందని బి.సి.ఐ తన లేఖలో నొక్కి చెప్పింది.
