కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం, ఆయనకు వ్యతిరేకంగా స్థానిక నేతలు పావులు కదపడంతో కేరళ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. హైకమాండ్ వద్ద చక్రం తిప్పే వేణుగోపాల్‌ను కేరళకు పంపిస్తే, ఢిల్లీలో తమకు అడ్డు తొలగుతుందని అక్కడి కోటరీ భావిస్తుండగా, కేరళ కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రతిపక్ష నేతగా ఉండి పార్టీని విజయతీరాలకు చేర్చిన వీడీ సతీశన్ తనకే ముఖ్యమంత్రి పదవి దక్కాలని గట్టిగా పట్టుబడుతున్నారు. టిక్కెట్ల పంపిణీ సమయంలో వేణుగోపాల్ తన పరపతిని ఉపయోగించి తన వర్గం వారికే ఎక్కువ సీట్లు ఇప్పించుకోవడంతో, ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఆయనకే ఉందని తెలుస్తోంది. సుమారు 47 మంది ఎమ్మెల్యేలు వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతుండటం సతీశన్ వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన వేణుగోపాల్‌ను ఢిల్లీ నుండి పంపించాలా వద్దా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. వేణుగోపాల్ కేరళకు వెళ్తే జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత బాధ్యతలు ఎవరు చూస్తారనేది హైకమాండ్‌ను వేధిస్తున్న ప్రశ్న. మరోవైపు, కేరళలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ముస్లిం లీగ్ వంటి మిత్రపక్షాలు సతీశన్ వైపు మొగ్గు చూపుతుండటం వేణుగోపాల్‌కు ప్రతిబంధకంగా మారింది. స్థానిక నేతల మనోభావాలను కాదని వేణుగోపాల్‌ను రుద్దితే పార్టీలో చీలికలు వస్తాయని కొందరు సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
అటు వేణుగోపాల్, ఇటు సతీశన్ మధ్య రాజీ కుదిర్చేందుకు పదవి పంపకం ఫార్ములాను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా, రాహుల్ గాంధీ తీసుకునే తుది నిర్ణయంపైనే కేరళ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆదివారం లోపు ఈ సస్పెన్స్‌కు తెరపడి, కేరళ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది అధికారికంగా ఖరారు కానుంది.
