అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ప్రస్తుతం ఒక వింతైన స్తబ్ధతకు చేరుకుంది. అంతా రొటీన్‌గా మారడంతో ఆ దేశాల మధ్య ఏం జరుగుతుందో ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం యధా తథా అన్నట్లుగా సాగుతున్నాయి. ఇటు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో గాండ్రిస్తుంటే, అటు ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న ఈ అహం పోరాటం ప్రపంచ శాంతిని పీటముడి వేసి ఉంచింది.
ట్రంప్ అవే గాండ్రింపులు
వైట్ హౌస్‌లో ట్రంప్ అడుగుపెట్టినప్పటి నుంచి ఇరాన్‌పై గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యమని చెబుతూనే, ఆర్థిక ఆంక్షలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇరాన్ తోక జాడిస్తే చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ” అంటూ ట్రంప్ చేసే ప్రకటనలు రోజూవారీ తంతుగా మారిపోయాయి. అయితే, ఈ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితమవుతాయా లేక యుద్ధానికి దారితీస్తాయా అన్నది ఆయనకే తెలియాలి.
ఇరాన్ ప్రతిఘటన – తగ్గని ధిక్కారం
అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ తన పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నిబంధనలను పక్కన పెట్టి, యురేనియం శుద్ధిని పెంచుతామని ఇరాన్ ప్రకటించడం అమెరికాకు సవాలుగా మారింది. మేము ఎవరికీ భయపడము, మా ఆత్మరక్షణ కోసం ఏదైనా చేస్తాం అంటూ టెహ్రాన్ నుంచి వినిపిస్తున్న ప్రతిధ్వనులు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను సజీవంగా ఉంచుతున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పీటముడి పడిన రాజకీయం
ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే.. ఇద్దరిలో ఎవరూ ముందుగా వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదు. అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలని ఇరాన్ కోరుతుంటే, ఇరాన్ తన అణు వైఖరిని మార్చుకోవాలని అమెరికా పట్టుబడుతోంది. ఈ మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్న ఐరోపా దేశాలు కూడా ఈ ఇద్దరి మొండితనం చూసి చేతులెత్తేస్తున్నాయి. ఫలితంగా, దౌత్యపరమైన చర్చలు ఎక్కడికక్కడే ఆగిపోయి, కేవలం సోషల్ మీడియా, మీడియా వేదికల ద్వారా హెచ్చరికలు పంపించుకోవడానికే పరిమితమయ్యారు.
సమస్య పరిష్కారం అటు అమెరికా.. ఇటు ఇరాన్ ఈగోల శాటిస్ఫేక్షన్ మీదనే ఆధారపడి ఉంది. వాళ్ల ఈగో ప్రపంచానికి పెను సమస్యలు సృష్టిస్తోంది.