తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అధికార పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమమైంది. ఆసక్తికర పరిణామాల మధ్య టీవీకేకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఐ(ఎం)తో పాటు దళిత సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్న వీసీ కూడా బేషరతు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో అనిశ్చితికి తెరదించి, ఒక సుస్థిరమైన లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా పార్టీల నేతలు వెల్లడించారు. ఈ మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సంఖ్యను దాటేశారు.
తొలుత విజయ్ సంప్రదింపుల తీరుపై విసికె పార్టీ అధినేత తిరుమావళవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, రాజకీయ వ్యూహకర్తల జోక్యంతో చివరకు ఆయన కూడా మద్దతుకు మొగ్గు చూపారు. కాంగ్రెస్తో పాటు డీఎంకే కూటమిలోని ప్రధాన మిత్రపక్షాలన్నీ ఇప్పుడు విజయ్ వైపు నిలబడ్డాయి. బీజేపీ , అన్నాడీఎంకే పుంజుకోకుండా అడ్డుకోవాలన్న వ్యూహంతోనే ఈ కీలక మలుపులు చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు.
విజయ్ సీఎం కావడానికి ఎం.కె. స్టాలిన్ మౌన సమ్మతి, రాజకీయ చాణక్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షాలు బలపడకుండా ఉండాలంటే విజయ్ నేతృత్వంలోని ప్రత్యామ్నాయ శక్తికి బాటలు వేయడమే ఉత్తమమని భావించిన స్టాలిన్, తన మిత్రపక్షాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్య రాజకీయాలకు చెక్ పెడుతూ విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది.
ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం, విజయ్ గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్నారు. వామపక్షాలు, వీసీకే , కాంగ్రెస్ పార్టీల ఐక్యమత్యంతో టీవీకే సర్కార్ నిలబడనుంది. అయితే ఇద్దరు, ముగ్గురు బయటకు వచ్చేసినా ప్రభుత్వం మళ్లీ మైనార్టీలో పడిపోతుంది.
