తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన ఒక అంతుచిక్కని థ్రిల్లర్‌ను తలపిస్తోంది. దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ, తొలి ప్రయత్నంలోనే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం , ఇప్పుడు అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. కాంగ్రెస్‌తో జతకట్టినా మ్యాజిక్ ఫిగర్ అందకపోవడంతో గవర్నర్ తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ద్రవిడ పార్టీలు రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారంజరుగుతోంది. అలా జరిగితే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలనే విజయ్ భావిస్తున్నట్లు వస్తున్న గాసిప్స్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. అయితే, ఈ వ్యూహం ఒకవేళ నిజమైతే, అది విజయ్ రాజకీయ భవిష్యత్తుకే ఒక పెద్ద గొడ్డలిపెట్టు కాక తప్పదు.
టీవీకే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే తప్పిదమే
రాజకీయాల్లో రాజీనామా అనేది ఒక భావోద్వేగపూరితమైన అస్త్రం కావచ్చు కానీ, అది ఎప్పుడూ ఒక పదునైన కత్తి లాంటిది. విజయ్ తన 107 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని పంపుతుంది. ప్రజలు ఆయనకు ఒక చారిత్రాత్మక అవకాశాన్ని ఇచ్చారు. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనే అసహనంతో ప్రజా తీర్పును తుంగలో తొక్కి రాజీనామాలు చేయడం వల్ల.. ఆయనకు పోరాడే తత్వం లేదని, బాధ్యతల నుంచి పారిపోతున్నారనే ముద్ర పడే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో సభలో ఉండి పోరాడటం కంటే సభను వదిలి వెళ్లడం ఎప్పుడూ బలహీనతగానే పరిగణించబడుతుంది.
ప్రజాతీర్పు ఏకపక్షంగా విజయకు లేదన్నది వాస్తవం
ఒకవేళ రాజీనామాలు చేస్తే, తదుపరి వచ్చే ఉప ఎన్నికలు ద్రవిడ పార్టీలకు ఒక వరంగా మారతాయి. అధికార యంత్రాంగం, ఆర్థిక బలం , క్షేత్రస్థాయి యంత్రాంగం కలిగిన ఈ రెండు పార్టీలు ఉప ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి మెజారిటీ స్థానాలను గెలుచుకుంటే, విజయ్ తన ఉనికిని కోల్పోవాల్సి వస్తుంది. స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా విజయ్ అనవసరంగా ఎన్నికలను ప్రజల మీద రుద్దారు అనే ప్రచారాన్ని ద్రవిడ పార్టీలు బలంగా జనాల్లోకి తీసుకెళ్తాయి. దీనివల్ల ఆయనపై ఉన్న సానుభూతి కాస్తా కాఠిన్యంగా మారి, అటు కేడర్‌లోనూ ఇటు ప్రజల్లోనూ చులకన అయ్యే అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఓపిక ఉండాలి !
ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ చేయాల్సిన పని రాజీనామా కాదు, నిరీక్షణ, పోరాటం. ఒకవేళ ద్రవిడ పార్టీలు సిద్ధాంతాలను పక్కన పెట్టి అపవిత్ర కలయికతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, అది ప్రజల్లో సహజంగానే ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఆ సమయంలో విజయ్ సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతుకను వినిపిస్తే, తదుపరి ఎన్నికల్లో ప్రజలే ఆయనకు సంపూర్ణ మెజారిటీని కట్టబెడతారు. రాజీనామాల వల్ల వచ్చే సానుభూతి కంటే, ప్రజల కోసం పక్షపాత రహితంగా పోరాడితే వచ్చే గౌరవం చాలా గొప్పది.
దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన తమిళనాడులో గెలుపు గుర్రం ఎక్కడం ఒకెత్తయితే, దాన్ని కాపాడుకోవడం మరొక ఎత్తు. విజయ్ గనుక ఈ భావోద్వేగపు రాజీనామా నిర్ణయం తీసుకుంటే, అది ఆయన రాజకీయ జీవితంలో దిద్దుకోలేని పెద్ద పొరపాటు అవుతుంది. అధికారం కోసం ఆరాటపడకుండా, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ అసెంబ్లీలో అడుగుపెట్టడమే ఒక నిజమైన నాయకుడి లక్షణం.
