ప్రజల్లోకి వెళ్లి పోరాడటం కంటే, ఏసీ గదుల్లో కూర్చుని కీబోర్డ్ వార్ చేయడం సులభమని వైసీపీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమికి కారణం తాము చేసిన పనులు కాదని, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులేనని బలంగా నమ్ముతున్న ఆ పార్టీ.. ఇప్పుడు జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టసుఖాలతో సంబంధం లేకుండా, హైదరాబాద్ అడ్డాగా ఈ డిజిటల్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. అంటే.. క్షేత్రస్థాయిలో జనం నాడి పట్టుకోవడం కంటే, ఇంటర్నెట్లో క్లిక్కులు, లైకులు కొట్టడమే అసలు సిసలు రాజకీయమని జగన్ డిసైడర్ అయ్యారు.
ఈ ప్లాన్ ప్రకారం ఊరికో వాలంటీర్ కాదు.. మండలానికో టెక్ వాలంటీర్ రంగంలోకి దిగుతారట. వీరు చేసే పని ఏంటంటే.. ఊళ్లలో తిరగడం కాదు, స్మార్ట్ ఫోన్లలో టీడీపీ పోస్టులకు కౌంటర్లు వెతకడం. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం పక్కన పెడితే, ఎవరైనా విమర్శిస్తే వారిపై నెక్స్ట్ లెవల్ లో విరుచుకుపడటమే వీరి అసలు టాస్క్. జనం మధ్య ఉంటే ఎక్కడ సమస్యలు అడుగుతారో అన్న భయంతోనేమో గానీ, ఇలా టెక్నాలజీ వెనుక దాక్కుని రాజకీయం చేయాలనుకోవడం చూస్తుంటే.. వైసీపీకి ప్రజల మీద కంటే డేటా అనలిటిక్స్ మీద నమ్మకం ఎక్కువైందని స్పష్టమవుతోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తాల్సింది పోయి, డిజిటల్ గొంతు పెంచుతామనడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో ఐదేళ్లూ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామే చేశామని చెప్పుకున్నా రాని ఫలితం, ఇప్పుడు కేవలం ఒక టెక్ ఫోర్స్ ద్వారా వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రజలకు వాస్తవాలు వివరించడానికి క్షేత్రస్థాయి పోరాటాలు ముఖ్యం కానీ, ఇంటర్నెట్ లోని యుద్ధాలు కాదని సగటు ఓటరుకు తెలిసినంతగా వైసీపీ మేధావులకు తెలిసినట్లు లేదు. ఫేక్ ప్రచారాలను తిప్పికొడతామని చెబుతున్న ఈ బృందం.. నిమిషాల వ్యవధిలోనే కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది అంటే, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు రోడ్ల మీద కంటే ఫోన్ల స్క్రీన్ల మీదే ఎక్కువగా కనిపించబోతున్నాయి.
జగన్ కొత్త వ్యూహం చూస్తుంటే.. మనమేమీ చేయక్కర్లేదు, అంతా మా టెక్ ఫోర్స్ చూసుకుంటుంది అన్నట్లుగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండాల్సిన పోరాట పటిమను పక్కన పెట్టి, ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల తరహాలో రాజకీయం చేయడం వైసీపీని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. టెక్నాలజీని వాడుకోవడం తప్పు కాదు కానీ, అది కేవలం ప్రత్యర్థులను తిట్టడానికే పరిమితమైతే.. అసలు రాజకీయ యుద్ధం గెలవడం సాధ్యమేనా? క్షేత్రస్థాయిలో పార్టీకి కార్యకర్తలు కరువవుతున్న తరుణంలో, ఈ డిజిటల్ సైన్యం వైసీపీని గట్టెక్కిస్తుందో లేక వర్చువల్ పార్టీగానే మిగిల్చేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.
