అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు ఓ ప్లానింగ్, ఓ విధానం ఉన్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్. ఓ వైపు పెద్ద సినిమాలు, మరో వైపు చిన్న సినిమాలు తీస్తూ నిత్యం బిజీగా ఉంటారు నాగవంశీ. క్రేజీ కాంబినేషన్లు సెట్ చేయడంలో పెట్టింది పేరు. ప్రమోషన్లు కూడా బాగా ప్లాన్ చేస్తుంటారు. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చాలు. బోల్డంత పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఈ సంస్థ చేతిలో చాలా సినిమాలున్నాయి. అయితే వాటిలో రెండు మాత్రం ప్రత్యేకం. ఇద్దరు హీరోల కెరీర్లో చాలా కీలకమైన సినిమాలు టేకప్ చేస్తోంది సితార. ఆ హీరోలే… అఖిల్, నితిన్.
అక్కినేని వారసులుగా అడుగుపెట్టారు నాగచైతన్య, అఖిల్. చైతూ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. అయితే.. అఖిల్ కి మాత్రం విజయాలు దక్కలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాక్సాఫీసు దగ్గర హిట్ రాలేదు. డూ ఆర్ డై పొజీషన్లో అఖిల్ చేస్తున్న సినిమా ‘లెనిన్’. జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. మేకింగ్ విషయంలో నాగవంశీ చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. యూత్ లో క్రేజ్ ఉన్న భాగ్యశ్రీని కథానాయికగా ఎంచుకొన్నారు. కొన్ని రీషూట్లు కూడా జరిగాయని టాక్. రిలీజ్ డేట్ విషయంలోనూ పక్కాగా ఉన్నారు. మరో సినిమాతో పోటీ లేకుండా చూసుకొని సోలో రిలీజ్ డేట్ న… ‘లెనిన్’ విడుదల చేస్తున్నారు. ఈమధ్యే నాగార్జున ఫైనల్ అవుట్ పుట్ చూసుకొన్నారు. ఆయన అన్ని రకాలుగా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమోషన్లు కూడా భారీగా చేయాలన్నది ప్లాన్. అఖిల్ కి హిట్టు గనుక పడితే.. ఆ క్రెడిట్ పూర్తిగా నాగవంశీదే అవుతుంది.
మరోవైపు నితిన్ ది కూడా ఇదే పరిస్థితి. తన కెరీర్ని ప్రామిసింగ్ గా మొదలెట్టిన నితిన్.. ఆ తరవాత వరుసగా 12 ఫ్లాపులు ఇచ్చాడు. ఇష్క్ తో మళ్లీ గాడిన పడ్డాడు. ఆ తరవాత కూడా మంచి సినిమాలే చేశాడు. కానీ కొన్నేళ్లుగా తనకు హిట్ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకొన్న రాబిన్వుడ్, తమ్ముడు కూడా డిజాస్టర్ల ఖాతాలో చేరిపోయాయి. అందుకే కొంత విరామం తీసుకొని ఈరోజే కొత్త సినిమా మొదలెట్టాడు. ఈ చిత్రాన్ని కూడా సితార సంస్థనే నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా నాగవంశీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్నారు. చాలా కథలు విన్న తరవాతే.. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ చేశారు. స్క్రిప్టు దశలోనే పకడ్బందీగా వ్యవహరించారు. మేకింగ్ లోనూ ఆయన ముద్ర స్పష్టంగా ఉండాల్సిందే. అటు అఖిల్, ఇటు నితిన్ కూడా తమ భారాన్ని నాగవంశీపైనే వేశారు. చూడాలి.. సితార లో అయినా ఈ హీరోల జాతకం మారుతుందేమో?
