తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఒక మాస్టర్ పొలిటికల్ గేమ్ ఆడారని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లేక తడబడుతున్న వేళ.. కాంగ్రెస్ అనూహ్యంగా డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించింది. దీన్ని డీఎంకే వెన్నుపోటుగా ప్రకటించి.. ఆ పార్టీతో సంబంధాలు తెంచుకున్నారు. ఇండీ కూటమి ఇక లేదని తేల్చేశారు.
కాంగ్రెస్ పైకి.. డీఎంకే సేఫ్ జోన్లోకి
ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వెళ్లి విజయ్‌తో చేతులు కలపడం ద్వారా, డీఎంకే పద్ధతిగా జాతీయ రాజకీయాల చిక్కుల నుంచి తప్పించుకుంది. ఒకవేళ డీఎంకే నేరుగా కాంగ్రెస్‌తో కలిసి ఉండి ఉంటే, వచ్చే ఐదేళ్లూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని, దర్యాప్తు సంస్థల నిఘాను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్సే స్వయంగా పొత్తు విచ్ఛిన్నం చేసుకుందన్న అభిప్రాయాన్ని కల్పించడం ద్వారా, స్టాలిన్ తనపై ఎటువంటి మచ్చ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్‌కు దూరంగా ఉంటామని లేఖ ఇవ్వడం ద్వారా బీజేపీ రాడార్ నుంచి డీఎంకే పూర్తిగా తప్పుకుంది.
బీజేపీతో వ్యక్తిగత వైరానికి చెక్
నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలతో స్టాలిన్‌కు వ్యక్తిగత వైరం లేదు, కేవలం రాజకీయంగా మాత్రమే విభేదించారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు దూరమవ్వడం ద్వారా ఆ రాజకీయం వైరం కూడా లేకుండా స్టాలిన్ చూసుకున్నారు. అదే సమయంలో, విజయ్ ప్రభుత్వం మనుగడ సాగించాలంటే డీఎంకే మిత్రపక్షాలైన లెఫ్ట్, వీసీకేల మద్దతు తప్పనిసరి కాబట్టి, పరోక్షంగా అధికారంపై పట్టును కూడా స్టాలిన్ నిలుపుకున్నట్లు అవుతుంది.
ఓడి గెలిచిన డీఎంకే
తమిళనాడు రాజకీయ చదరంగంలో డీఎంకే ఓడిపోయి కూడా గెలిచింది. కాంగ్రెస్‌ను విజయ్ వైపు పంపడం ద్వారా అటు విజయ్ను తన కనుసన్నల్లో ఉంచుకుంటూనే, ఇటు కేంద్రం దృష్టిలో తటస్థ పాత్రను పోషించేలా స్టాలిన్ పావులు కదిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్-బీజేపీ మధ్య యుద్ధం కొనసాగుతున్నా, డీఎంకే మాత్రం తన ఉనికిని, ప్రయోజనాలను పదిలం చేసుకుంది. రాబోయే ఐదేళ్లు తమిళనాడులో విజయ్ పాలన సాగినా, దాని వెనుక అసలు వ్యూహకర్తగా స్టాలిన్ తన మార్క్ రాజకీయాలను కొనసాగించబోతున్నారు.
