పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాల కాలం తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ పతనం వెనుక అసలు విలన్ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే. ఒకప్పుడు మమతకు అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీకి వెన్నెముకగా ఉన్న సువేందు అధికారి నేడు బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం వెనుక పెద్ద కథే ఉంది. పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం, అహంకారపూరిత నిర్ణయాలు తట్టుకోలేక బయటకు వచ్చిన సువేందు, చివరకు అదే మేనల్లుడి రాజకీయ క్రీడకు చరమగీతం పాడుతూ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు.
అభిషేక్ అతి.. పార్టీకి తీరని నష్టం
బెంగాల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణలో తృణమూల్ ఓటమికి ప్రధాన కారణం అభిషేక్ బెనర్జీ ప్రవర్తనే. పార్టీ సీనియర్లను గౌరవించకుండా, కేవలం తన వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. ముఖ్యంగా సువేందు అధికారి వంటి మాస్ లీడర్లను అభిషేక్ కావాలనే టార్గెట్ చేసి బయటకు పంపించారని, ఆ తప్పుకు ఇప్పుడు మమతా బెనర్జీ భారీ మూల్యం చెల్లించుకున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయం నడపాలని చూసిన అభిషేక్ వ్యూహం బెడిసికొట్టింది.
సువేందుకు మమత ప్రధాన అనుచరుడు
సువేందు అధికారి ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడు. నందిగ్రామ్ పోరాటంలో మమతను అధికారంలోకి తెచ్చిన అసలు సిసలు యోధుడు. కానీ పార్టీలో మేనల్లుడి ప్రాధాన్యత పెరగడం, తన ఉనికికే ముప్పు రావడం గమనించిన సువేందు 2020లో బీజేపీలో చేరి సరికొత్త యుద్ధం ప్రకటించారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించి సత్తా చాటిన ఆయన, తాజా 2026 ఎన్నికల్లో ఏకంగా మమత కంచుకోట భవానీపూర్ గడ్డపైనే ఆమెను మట్టికరిపించి చారిత్రాత్మక విజయం సాధించారు. కష్టపడి పని చేసే నేతలకు ప్రజలు పట్టం కడతారని సువేందు నిరూపించారు.
అభిషేక్ సిద్ధాంతం లేని రాజకీయం
అభిషేక్ బెనర్జీ అనుసరించిన డైమండ్ హార్బర్ మోడల్ కేవలం అక్రమాలు, దౌర్జన్యాలతో కూడుకున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఈ ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్‌తో ఘర్షణ పడటం, ఈవీఎంల మీద నెపం నెట్టడం వంటి చర్యల ద్వారా అభిషేక్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూశారు. కానీ బెంగాల్ ఓటర్లు మేనల్లుడి అహంకారాన్ని కాదని, అభివృద్ధి హామీ ఇచ్చిన సువేందు అధికారి వైపు నిలబడ్డారు. టీఎంసీ సీనియర్ నేతలు సైతం లోలోపల అభిషేక్ తీరుపై విరక్తితోనే ఉన్నారనేది బహిరంగ రహస్యం. మేనల్లుడి అరాచక పాలన, మరోవైపు మమత మౌనం టీఎంసీని ముంచేయగా.. సువేందు పట్టుదల బీజేపీకి మొదటిసారి బెంగాల్ గడ్డపై పట్టం కట్టింది. ఇక బెంగాల్ రాజకీయాల్లో మమత-అభిషేక్ శకం ముగిసి, సువేందు మార్క్ పాలన ప్రారంభమయింది.
