వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డికి పేర్ల మీద ఉన్న మక్కువ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో రోడ్ల మీద పడే ప్రతి రాయికి, పంచే ప్రతి బియ్యం ముక్కకి తన పేరు ఉండాలని తపన పడ్డారు. చివరికి ఇప్పుడు అధికారం పోయి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితిలో ఉన్నా.. ఆ నామకరణాల పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా పార్టీ కోసం ఏర్పాటు చేస్తున్న ఐటీ విభాగం పేరు కూడా జగనన్న టెక్ ఫోర్స్ అని పెట్టుకున్నారు.
దేనికైనా ముందు జగనన్న !
గతంలో వైఎస్సార్ పథకాలన్నింటికీ వైఎస్సార్ పేరు ఉండేది. కానీ జగన్ రెడ్డి వచ్చాక, తన తండ్రి ఫోటోను సైడ్ చేసి మరీ ప్రతి పథకానికి జగనన్న అనే ట్యాగ్ లైన్ తగిలించేసుకున్నారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న తోడు.. ఇలా ఊపిరి పీల్చుకుంటే చాలు జగనన్న పేరు వినపడేలా చేశారు. చివరకు మరుగుదొడ్లకు కూడా తన పేరే పెట్టించుకోవాలని చూశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు పార్టీని డిజిటల్ లెవల్లో ఉద్ధరించడానికి ఏర్పాటు చేస్తున్న విభాగానికి కూడా తన పేరే పెట్టడం చూస్తుంటే, ఆయనకు తన పేరు మీద ఉన్న ప్రేమ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైఎస్ఆర్ పేరు తీసేసి జగనన్న కాంగ్రెస్ అని పార్టీ పేరు మార్చుకుంటే బెటర్
పార్టీ పేరులో వైఎస్సార్ అని ఉన్నా, జగన్ రెడ్డికి మాత్రం అది తన సొంత కాంగ్రెస్ లాగే అనిపిస్తుందేమో. అందుకే కాబోలు, ఐటీ ఫోర్స్ కి కూడా ఆ పేరే తగిలించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎలాగూ పార్టీలో అందరూ ఆయన మాటే వినాలి, అంతా ఆయన చుట్టూనే తిరగాలి కాబట్టి, ఆ పార్టీ పేరును కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మార్చేసి జగనన్న కాంగ్రెస్ అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అని సైటైర్లు వేస్తున్నారు.
ఇంత ఆత్మన్యూనతా అయితే ఎలా?
సాధారణంగా ఐటీ విభాగాలు అంటే పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సమస్యలను హైలైట్ చేయడానికి ఉంటాయి. కానీ వైసీపీలో మాత్రం అది కేవలం జగనన్న భజన చేయడానికి, ఆయన గ్రాఫ్‌ను ఎలాగోలా పెంచడానికే అన్నట్లుగా పేరులోనే క్లారిటీ ఇచ్చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల కంటే, ఆ పేరులో తన ముద్ర ఉండటమే జగన్ రెడ్డికి అత్యంత కీలకంగా కనిపిస్తోంది. రేపు పొద్దున పార్టీ జెండా మీద కూడా వైఎస్సార్ బొమ్మ తీసేసి, తన సొంత ఫోటో మాత్రమే పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాల్లో జోకులు పేలుతున్నాయి. ఓటమి నేర్పిన పాఠాల కంటే.. తన పేరును ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనే దానిపైనే జగన్ రెడ్డి ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.