మెగా కోడలయ్యాక లావణ్య త్రిపాఠి నుంచి ఒక సినిమా వచ్చింది. అదే.. ‘సతీ లీలావతి’. ఇందులో లావణ్యది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. ఈ కథంతా తన చుట్టూనే తిరుగుతుంది. పెళ్లయ్యాక చేసిన తొలి సినిమా కాబట్టి.. కచ్చితంగా ఎంతో కొంత ఎట్రాక్షన్ ఉంటుంది. పైగా తను ఇప్పుడు మెగా కోడలు. రిలీజ్ కి ముందు కాస్తో కూస్తో హడావుడి చేసే వీలుంది. ట్రైలర్ ని రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు వస్తారని, వాళ్ల రాకతో ఈ సినిమాకు క్రేజ్ వస్తుందని ఊహించారు. కానీ అలాంటివేం జరగలేదు. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటిది ఏం చేయలేదు. నేరుగా సినిమాని విడుదల చేసేశారు.
ఈరోజుల్లో చిన్న చితకా సినిమాలు సైతం పబ్లిసిటీ పరంగా హడావుడి చేస్తున్నాయి. సినిమాలో విషయం ఉన్నా, లేకున్నా ప్రమోషన్లు క్రియేటీవ్ గా ఉంటున్నాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, మీడియా మీట్లూ తప్పని సరి. కానీ… ‘సతీ లీలావతి’ వీటన్నింటికీ దూరంగా నిలిచింది. ఈ సినిమా ఒకటి వస్తుందన్న విషయమే చాలామందికి తెలీదు. దానికి తగ్గట్టుగానే ఈరోజు వీక్ ఓపెనింగ్స్ దక్కించుకొంది. థియేటర్ కి వెళ్తే ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ మంది కనిపించలేదు. టికెట్లు తెగక చాలా షోలు కాన్సిల్ కూడా అవుతున్నాయి. భీకరమైన పబ్లిసిటీ చేస్తేనే కానీ, జనాలు థియేటర్లకు రాని రోజులు ఇవి. అలాంటిది ఇలా సైలెంట్ గా వదిలేస్తే ఎవరు పట్టించుకొంటారు. సినిమాపై నమ్మకం లేకే నిర్మాతలు పబ్లిసిటీపై రూపాయి కూడా ఖర్చు పెట్టలేకపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం శాటిలైట్, ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోక పోవడం వల్ల… నిర్మాతలు ఈ సినిమాని ప్రమోట్ చేయలేకపోయారు. ఫలితం… ఈ రోజు థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
సతీ లీలావతితో పాటు గా విడుదలైన గోదారి గట్టుమీద, రేజర్ సినిమాలదీ ఇదే పరిస్థితి. రవిబాబు సినిమా అయితే మరీ ఘోరంగా తయారైంది. వెరసి ఈ వారం కూడా బాక్సాఫీసు బోసి బోయింది.


