విజయ్‌కు మ్యాజిక్ మార్క్ అందిందని ప్రమాణ చేయడమే తరువాయి అని జరిగిన ప్రచారం మళ్లీ రాంగ్ అయింది. రాజ్ భవన్ నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలో.. విజయ్‌కు ఇంకా రెండు స్థానాలు తక్కువ ఉన్నట్లుగా ప్రకటన వచ్చింది. దీంతో శనివారం విజయ్ ప్రమాణ స్వీకారం ఖరారు కాలేదు.
శుక్రవారం సాయంత్రం వరకు విజయ్ సుమారు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారని వార్తలు వచ్చినప్పటికీ, రాజ్‌భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ ఇప్పటికీ తన మెజార్టీని గవర్నర్‌కు నిరూపించలేకపోయారు. తాజా లెక్కల ప్రకారం విజయ్ వద్ద కేవలం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. రెండు స్థానాలు ఉన్న వీసీకే, రెండు స్థానాలున్న ముస్లింలీగ్ మద్దతు ప్రకటించినప్పటికీ లేఖలు ఇవ్వలేదు. మ్యాజిక్ ఫిగర్ 118కి మరో ఇద్దరు సభ్యుల బలం తక్కువగా ఉంది. ఈ క్రమంలోనే శనివారం జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవర్నర్ నుండి ఎటువంటి ఆహ్వానం అందలేదు.
విజయ్ సమర్పించిన జాబితాలో వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల నుంచి అధికారిక మద్దతు లేఖలు లేవని గవర్నర్ కార్యాలయం గుర్తించినట్లు సమాచారం. ఈ రెండు పార్టీలు కలిపి నాలుగు సీట్లను కలిగి ఉన్నాయి. విజయ్ టీవీకేకు సొంతంగా 107 సీట్లు ఉండగా, కాంగ్రెస్ 5 , లెఫ్ట్ పార్టీలు 4 మద్దతు ఇచ్చినా బలం 116 వద్దే ఆగిపోయింది. వీసీకే అధినేత తిరుమావళవన్ మద్దతుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుండటం, ఐయూఎంఎల్ స్పష్టమైన లేఖ ఇవ్వకపోవడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ రాజ్యాంగపరమైన నిర్ణయం తీసుకునేందుకు వేచి చూస్తున్నారు.
విజయ్ అభిమానులు శనివారం ఉదయం 11 గంటలకు పట్టాభిషేకం ఉంటుందని భారీ ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో, గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన ఈ వార్త టీవీకే వర్గాల్లో నిరాశ నింపింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం 118 మంది సభ్యుల మద్దతు లేఖలు ఫిజికల్‌గా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ పొత్తులో ఉన్న పార్టీలు సంతకాలతో కూడిన లేఖలు ఇవ్వకపోతే, కేవలం ప్రకటనల ఆధారంగా గవర్నర్ ఆహ్వానించలేరు. దీంతో విజయ్ మరోసారి తన మిత్రపక్షాలతో అత్యవసరంగా సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తిస్థాయిలో 118 మంది మద్దతు లేఖలు అందిన తర్వాతే విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.