తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఏపీ ప్రభుత్వం విచారణను క్లైమాక్స్‌కు చేర్చింది. ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ దినేష్ కుమార్ సమర్పించిన నివేదికను లోతుగా విశ్లేషించి, దోషులపై తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన హై లెవెల్ కమిటీ ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో డీజీపీ, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. నెయ్యి నాణ్యత లోపం, టెండర్ల అక్రమాలు మరియు గత పాలకమండలి నిర్ణయాలపై ఈ కమిటీ తుది విచారణ జరపనుంది.
విచారణ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేవలం వారంలోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఉన్నత స్థాయి కమిటీని ఆదేశించింది. దినేష్ కుమార్ నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలించి, ఎవరెవరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి? ఏయే విభాగాల్లో అక్రమాలు జరిగాయి? అనే అంశాలపై ఈ కమిటీ కీలక సిఫార్సులు చేయనుంది. భవిష్యత్తులో ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా టీటీడీలో తీసుకురావాల్సిన వ్యవస్థాగత మార్పులపై కూడా ఈ కమిటీ దిశానిర్దేశం చేయనుంది.
శ్రీవారి ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన వారిపై ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం, ఈ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా నెయ్యి సరఫరాలో రాజకీయ జోక్యం, అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టిన అధికారులపై, గత బోర్డు సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా టీటీడీ వ్యవస్థలో భారీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఈ నిర్ణయంతో శ్రీకారం చుట్టింది. ఒక వారంలో నివేదిక రానుండటంతో, తదుపరి తీసుకోబోయే నిర్ణయాలు రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.


