కొంతమంది సీనియర్ హీరోలు, నటులు గేర్ మార్చారు. కొత్త పంథాలో వెళ్లడానికి సిద్ధమయ్యారు. రాజశేఖర్, మోహన్ బాబు లాంటి సీనియర్లు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలవైపు మొగ్గు చూపించడం ఆహ్వానించదగిన పరిణామం. పాత్రలకు, కథలకు కొత్త రూపు తీసుకురావడంలో ఈ మార్పు దోహద పడుతుంది. జేడీ చక్రవర్తి సైతం విలన్ పాత్రలవైపు చూపిస్తున్నాడు. తనకు ఆల్రెడీ విలనిజం పండించిన అనుభవం ఉంది. కాకపోతే ఈ జనరేషన్ దర్శకులతో పని చేయడం కొత్త టాస్క్.
అయితే వీళ్లందరినీ సరిగా వాడుకొంటున్నామా, లేదా? అనేది డిబేటబుల్ పాయింట్. ‘బైకర్’ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. ఆయన వల్ల ఆ పాత్రకు హుందాతనం వచ్చింది. ఈ విషయంలో మరో మాటకు తావు లేదు. కానీ ఆ పాత్ర వల్ల రాజశేఖర్ కు ఒరిగిందేమిటన్నది ప్రశ్న. రాజశేఖర్ లాంటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారితే.. ఆయా పాత్రల నుంచి ప్రేక్షకులు ఎక్కువగా ఊహిస్తారు. దర్శకుడి బాధ్యత రాజశేఖర్ ని ఒప్పించడం తో ఆగిపోకూడదు. ‘ఈ క్యారెక్టర్ ఈయన తప్ప ఎవరూ చేయలేరు’ అన్నట్టుగా తీర్చిదిద్దాలి. ఆ విషయంలో ‘బైకర్’ టీమ్ విఫలం అయ్యింది.
‘గాయపడ్డ సింహం’ విషయంలోనూ ఇదే జరిగింది. జేడీ చక్రవర్తి విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. కానీ అంత ఇంపాక్ట్ ఆ పాత్రలో కనిపించలేదన్నది వాస్తవం. జేడీ లుక్ పై పెట్టిన శ్రద్ద, దర్శకుడు ఆ పాత్రపై పెట్టలేదు. రైటింగ్ కూడా అంతంత మాత్రంగా సాగింది. దాంతో జేడీ పాత్రకు ఉండాల్సిన ఇంపాక్ట్ రాలేదు.
‘పారడైజ్’లో మోహన్ బాబు విలన్ గా కనిపించబోతున్నారు. మోహన్ బాబు విలనిజం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా బయటి సినిమాల్లో ఆయన నటించి చాలా కాలమైంది. నాని సినిమాలకు ఉండే క్రేజ్ తెలిసిందే. అందులో మోహన్ బాబు పాత్ర ఏ స్థాయిలో ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. మరి శ్రీకాంత్ ఓదెల కలక్షన్ కింగ్ ని ఎలా చూపిస్తాడో చూడాలి. మోహన్ బాబు క్యారెక్టర్ గనుక క్లిక్ అయితే… పెద్ద హీరోల సినిమాల్లో విలన్ పాత్రకు మరో ఆప్షన్ వెదుక్కోవాల్సిన పని ఉండదు.
రాజశేఖర్, జేడీ, మోహన్ బాబు…. ఆ తరవాత ఇంకెవరైనా కావొచ్చు. వీళ్ల రాకతో విలనిజం కొత్త పుంతలు తొక్కడం ఖాయం. కాకపోతే.. సరిగా వాడుకొనే టెక్నిక్ తెలియాలి. వీళ్ల క్యాలిబర్ ని సరిగా వాడుకొంటే, క్యారెక్టర్ గానివ్వండి, విలన్ పాత్ర కానివ్వండి.. శక్తిమంతంగా ఆయా పాత్రల్ని తయారు చేసుకోగలిగితే మిగిలిన వాళ్లకూ ఈ దశగా అడుగులు వేయడానికి ధైర్యం దొరుకుతుంది. నటులు తమ పంథా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక శక్తి చూపించాల్సింది దర్శకులే.
