తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గానికి శాఖలను కేటాయించారు. అత్యంత కీలకమైన, వ్యూహాత్మక శాఖలను విజయ్ తన వద్దే ఉంచుకున్నారు. హోంశాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ అండ్ వాటర్ సప్లై, మహిళా, శిశు, వృద్ధుల, వికలాంగుల సంక్షేమ శాఖలను విజయ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. పరిపాలనలో ఎక్కడా లూప్‌హోల్స్ లేకుండా, నేరుగా తానే పర్యవేక్షించాలనే పట్టుదలతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మంత్రివర్గ కేటాయింపుల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం.. సీనియర్ నేత శెంగోట్టయన్కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించడం. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న శెంగోట్టయన్ వంటి నేత చేతిలో ఖజానా బాధ్యతలు పెట్టడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో నడుస్తుందనే సంకేతాన్ని విజయ్ పంపారు. టీవీకే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో, వ్యూహరచనలో కీలక పాత్ర పోషించిన ఆదవ్ అర్జునకు పబ్లిక్ వర్క్స్ , క్రీడా శాఖల బాధ్యతలు దక్కాయి. అలాగే, సోషల్ మీడియా, ఐటీ వింగ్‌లో చురుగ్గా ఉంటూ విజయ్‌కు నమ్మకస్తుడిగా మారిన ఆర్. నిర్మల్‌కుమార్‌కు విద్యుత్ , న్యాయ శాఖ వంటి ప్రతిష్టాత్మక శాఖను అప్పగించారు.
చదువుకున్న వారికి, నిపుణులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ కీర్తనకు అత్యంత కీలకమైన పారిశ్రామిక శాఖను కేటాయించారు. త్వరలో విజయ్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. పలువురు కాంగ్రెస్ తో పాటు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకూ చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి.
