తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేసిన విజయ్ నేతృత్వంలోని టీవీకే , ఇప్పుడు మెజారిటీ మార్కును చేరుకోవడానికి పాట్లు పడాల్సి వస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, టీవీకే స్వయంగా 108 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ, మొత్తం సంఖ్యాబలం 113. విజయ్ ఒక్క చోట రాజీనామాతో 112కు పరిమితమైంది. తాజాగా గవర్నర్‌ను కలిసిన విజయ్, మెజారిటీకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల పూర్తి జాబితాను సమర్పించలేకపోయారు. కేవలం 112 మంది మద్దతు ఉన్న జాబితాను మాత్రమే అందించడంతో, ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది.
విజయ్ ఆశలు పెట్టుకున్న వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, విడుతలై చిరుతైగల్ కట్చి పార్టీలు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చాయి. ఎన్నికల ఓటమి తర్వాత కూడా తాము డీఎంకే కూటమితోనే కొనసాగుతామని ఆ పార్టీలు స్పష్టం చేశాయి. విజయ్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో, టీవీకే ఇప్పుడు ఇతర మార్గాల కోసం అన్వేషిస్తోంది. కాంగ్రెస్ మద్దతు ఉన్నప్పటికీ, మిగిలిన సంఖ్యను ఎలా భర్తీ చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చీలికపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నప్పటికీ, అధికారికంగా ఎవరూ ముందుకు రాలేదు. అతిపెద్ద పార్టీగా అవతరించినందున, అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని షరతు విధిస్తూ గవర్నర్ ఆయనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారంలో నేను ఎవరితోనూ పొత్తు పెట్టుకోను.. సింగిల్ గానే వస్తాను అని ప్రకటించిన విజయ్, ఇప్పుడు పీఠం కోసం కాంగ్రెస్ దగ్గరకు వెళ్లడం, ఇతర పార్టీల మద్దతు కోసం వెంపర్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరంభంలోనే ఇన్ని రాజీలు పడితే, రాబోయే ఐదేళ్ల కాలంలో సుస్థిరమైన పాలన అందించడం సాధ్యమేనా అన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
