కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెను మార్పులు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈ సారి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. యూడీఎఫ్ మ్యాజిక్ ఫిగర్ 71ని దాటి 80కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించలేక రెండో స్థానానికి పరిమితమైనట్లు కనిపిస్తోంది. కేరళ ఓటర్లు మార్పు విధానానికే జై కొట్టినట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
విపక్ష నేత వీడీ సతీశన్ తన నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీ దిశగా సాగుతుండగా, దాదాపు ఏడుగురు ఎల్డీఎఫ్ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో యూడీఎఫ్ అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. మరోవైపు, తిరువనంతపురం వంటి కొన్ని స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తూ ఉనికిని చాటుకుంటోంది. ప్రస్తుతం అందుతున్న ఫలితాల సరళిని బట్టి చూస్తే, కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
అటు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మాత్రం బీజేపీ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. బీజేపీ కూటమి 126 స్థానాలకు గానూ 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జలుక్బరిలో హిమంత బిశ్వ శర్మ భారీ ఆధిక్యంతో తన గెలుపును ఖాయం చేసుకోగా, మిత్రపక్షం అసోం గణ పరిషత్ కూడా మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి అస్సాంలో కొంత మేర పుంజుకున్నప్పటికీ, బీజేపీ కోటను బద్ధలు కొట్టడంలో విఫలమైంది. గౌరవ్ గొగోయ్ వంటి నేతలు తమ వ్యక్తిగత స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అభివృద్ధి మంత్రం , హిమంత చరిష్మా పనిచేసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా తేయాకు తోటల కార్మికులు, గ్రామీణ ఓటర్లు బీజేపీకే పట్టం కట్టారు.
దక్షిణాదిన కేరళలో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకోగా, ఈశాన్యాన అస్సాంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ ఫలితాలు అటు యూడీఎఫ్ శ్రేణుల్లో, ఇటు బీజేపీ క్యాడర్లో పండుగ వాతావరణాన్ని నింపాయి. సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడనున్నాయి.
