తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధిస్తున్న అద్భుత ఫలితాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విజయం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందంటూ నెటిజన్లు పాత వీడియోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయి వాస్తవాల చూస్తే , ఈ విజయానికి ప్రశాంత్ కిషోర్‌కు క్రెడిట్ ఇవ్వడం కొంత అతిశయోక్తిగానే కనిపిస్తోంది. పీకే కేవలం టీవీకే ప్రారంభ దశలో మాత్రమే ఒక మార్గదర్శిగా కనిపించారు తప్ప, ఎన్నికల సమయంలో టీవీకేకు ఆయన పని చేయలేదు.
పార్టీ స్థాపన సమయంలో పీకే కొన్ని సూచనలు చేసిన మాట వాస్తవం. అప్పట్లో ఆయన విజయ్ను అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకోవాలని, అవసరమైతే డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించి రాజకీయాల్లో అనుభవం సంపాదించాలని ఒత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తన పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా ద్రవిడ పార్టీలతో చేతులు కలిపేందుకు విజయ్ నిరాకరించారు. ఈ విభేదాల కారణంగానే పీకే టీవీకేకు దూరమయ్యారు. ఆ తర్వాత తన పూర్తి దృష్టిని బీహార్‌పైనే కేంద్రీకరించారు
గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సూరాజ్ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఒక్క సీటు కూడా గెలవకపోగా, మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. స్వరాష్ట్రంలోనే తన వ్యూహాలు పలకని స్థితిలో ఉన్న పీకే, ఆ తర్వాత మళ్లీ తమిళనాడు వచ్చి విజయ్ కోసం పని చేసిన పరిస్థితులు కనిపించలేదు. బీహార్ ఓటమి తర్వాత ఆయన రాజకీయంగా కొంత స్తబ్దుగా ఉన్న తరుణంలో, ఇప్పుడు విజయ్ సాధించిన ఘనతను ఆయన ఖాతాలో వేయడం సరికాదనే వాదన బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం విజయ్ సాధించిన ఈ స్థాయి ఫలితాలు కేవలం ఆయన వ్యక్తిగత ఇమేజ్, క్షేత్రస్థాయిలో టీవీకే కార్యకర్తల కష్టం , ద్రవిడ పార్టీలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్లే సాధ్యమయ్యాయి. పీకే గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను పట్టుకుని నెటిజన్లు ఆయనను మాస్టర్ మైండ్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అసలు క్రెడిట్ మాత్రం విజయ్ ఒంటరి పోరాటానికి దక్కుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకప్పుడు పని చేసినంత మాత్రాన, ఇప్పుడు వచ్చిన ప్రతి విజయానికి పీకేనే కారణం అనడం కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే.
