ఈనెల 15న సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ విడుదల కావాల్సివుంది. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘ఓ బేబీ’ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి, సమంత సోలో లీడ్ కాబట్టి, తన భర్త నిర్మాతగా మారాడు కాబట్టి.. కచ్చితంగా ఈ సినిమాపై ఫోకస్ ఉంటుంది. దానికి తోడు ప్రమోషన్లూ గట్టిగానే చేయాలని భావించింది సమంత. అయితే.. సడన్ గా ఎందుకో బంగారం మెరవడం మానేసింది. 15న రిలీజ్ పెట్టుకొని ఇంకా ఎలాంటి హడావుడి చేయడం లేదు. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం సినిమా వాయిదా పడుతుందన్న వార్తలు గట్టిగా వినిపించడం మొదలెట్టాయి. అందుకే.. ప్రమోషన్లు చేయడం లేదని తెలుస్తోంది.
‘టాక్సిక్’ జూన్ 4న రావాల్సివుంది. కానీ వాయిదా పడింది. దాంతో ‘మా ఇంటి బంగారం’ జూన్ 4 తేదీని టార్గెట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ డేట్ ‘పెద్ది’ బ్లాక్ చేసింది. సో.. సమంతకు ఛాన్స్ లేనట్టే. జూన్ 26న ‘లెనిన్’ తో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల్ తో సమంత సినిమా పోటీ పడడం కొంత వరకూ మార్కెట్ పరంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ అది ఏమాత్రం సేఫ్ కాదు. సమంతకు సోలో రిలీజ్ డేట్ కావాలి. అందుకోసం సినిమాని నిరవధికంగా వాయిదా వేసే ఛాన్సుంది. అందుకే… టీమ్ కూడా రిలీజ్ డేట్ పై స్పందించడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి ఏం బాలేదు. సినిమాలు వస్తున్నా వసూళ్లు కనిపించడం లేదు. ఐపీఎల్ ఫీవర్ గట్టిగా ఉంది. దానికి తోడు ఎండలు. సినిమాల్ని గట్టిగా ప్రమోట్ చేసుకొన్నా, జనాలు రాని పరిస్థితి. అందుకే ఐపీఎల్ హడావుడి అయ్యాకే.. సమంత సినిమాని విడుదల చేసే ఛాన్సుంది.