పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణంలో రాజకీయ వ్యూహకర్త సంస్థ ఐప్యాక్ డైరక్టర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఎన్నికల వ్యూహాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాల్లోనూ ఈ సంస్థ జోక్యం చేసుకుందనే ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి నీడలా వ్యవహరించిన ఈ సంస్థ ప్రతినిధులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనే కోణంలో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. అక్కడ దొరికిన ఆధారాలు ఆంధ్రప్రదేశ్‌లోని గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఉన్న అనుబంధం బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి.
వైసీపీ ఐదేళ్ల కాలంలో ఏపీలో ఐప్యాక్ సంస్థ సమాంతర ప్రభుత్వంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామ సచివాలయాల వరకు ఈ సంస్థ ప్రతినిధుల కనుసన్నల్లోనే పాలన సాగిందనే వాదన బలంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగంపై పూర్తి పట్టు సాధించిన ఈ సంస్థ నాయకత్వ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసింది. పార్టీ వ్యవహారాలు , ప్రభుత్వ పథకాల అమలు మధ్య తేడా లేకుండా చేయడంలో ఐప్యాక్ కీలక పాత్ర పోషించింది. ఐదేళ్లపాటు సాగిన ఈ పెత్తనంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం చేతులు మారిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఐప్యాక్ సేవలకు ప్రతిఫలంగా వివిధ మార్గాల్లో భారీగా నిధులు తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రకటనలు, సోషల్ మీడియా నిర్వహణ, ప్రత్యేక ప్రచార కార్యక్రమాల పేరిట ఖజానా నుంచి వందల కోట్లు ఆ సంస్థకు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. బెంగాల్లో జరిగిన అరెస్టుతో ఈ సంస్థ ఆర్థిక లావాదేవీలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. కోల్‌కతాలో బయటపడ్డ బొగ్గు స్కామ్ మూలాలు ఏపీలోని నాటి ప్రభుత్వ పెద్దలతో ముడిపడి ఉన్నాయా అనే అనుమానం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ ఆర్థిక మూలాలను శోధిస్తే జగన్ హయాంలో సాగిన ఐప్యాక్ గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.
రాజకీయ కన్సల్టింగ్ పేరుతో వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకున్న ఈ సంస్థ తీరుపై ఇప్పుడు లోతైన విచారణ జరగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఒక ప్రైవేట్ సంస్థ తన గుప్పిట్లో పెట్టుకోవడం తీవ్రమైన పరిణామంగా పరిగణించవచ్చు. బెంగాల్లో తీగ లాగితే ఏపీలోని డొంక కదిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాటి ప్రభుత్వ నిర్ణయాల్లో ఐప్యాక్ ప్రమేయం మరియు ఆ సంస్థకు అక్రమంగా అందిన నిధులపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని స్పష్టమవుతోంది.
