‘ఉస్తాద్’ తరవాత పవన్ కల్యాణ్ చేయబోయే సినిమా సురేందర్ రెడ్డితోనే. ఈ కాంబో ఎప్పుడో ఖరారైపోయింది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. వీలైనంత త్వరలో ఈ సినిమాని పట్టాలెక్కించాలని నిర్మాత భావిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. అమరావతిలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆఫీస్ తెరిచారట. పవన్ కల్యాణ్ ఎప్పటి కప్పుడు స్క్రిప్టు పనుల్ని పర్యవేక్షిస్తున్నారని, ఆయన సూచనలు, సలహాలతోనే కథ తయారవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ ఇద్దరూ అమరావతిలోనే ఉంటూ స్క్రిప్టు పనులు చూసుకొంటున్నారు. ఎప్పటికప్పుడు పవన్‌కు అప్ డేట్ ఇస్తున్నారని సమాచారం.
‘ఉస్తాద్’ పవన్ ఫ్యాన్స్ ని బాగా నిరుత్సాహ పరిచింది. `ఓజీ`తో వచ్చిన ఊపు.. `ఉస్తాద్`తో చల్లారిపోయింది. దాంతో తదుపరి సినిమాపై పవన్ మరింత దృష్టి పెట్టాల్సివచ్చింది. స్క్రిప్టు పక్కాగా వచ్చి, అన్ని విషయాలూ లాక్ చేసుకొన్న తరవాతే.. సెట్స్ పైకి వెళ్లాలని పవన్ భావిస్తున్నారు. పవన్ ఏ లుక్ లో కనిపించాలి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండాలి అనేదానిపైనా చర్చలు జరుగుతున్నాయి. పవన్ ఇప్పుడు గడ్డం పెంచుతున్నారు. ఇదంతా ఈ సినిమా కోసమే అని తెలుస్తోంది. మరోవైపు ‘ఓజీ 2’ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పై కూడా పవన్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. వీలైతే ‘ఓజీ 2’ని కూడా వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని పవన్ భావిస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ పనులు జరుగుతున్నాయి. ఈ బ్యానర్‌పై చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీసే ఆలోచనలు ఉన్నాయి.


