రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం చమురు కంపెనీలు సరఫరాలో ఎలాంటి లోటు లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రధానంగా చమురు కంపెనీలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ పరిమితులను తగ్గించడం ఒక కారణమైతే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా భారీగా ధరల పెంపు ఉంటుందనే అంచనాలు మరో ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
ఈ రేట్ల సవరణ ఊహాగానాలతో కంపెనీలు కావాలనే సరఫరాను నియంత్రిస్తూ కృత్రిమ కొరత ను సృష్టిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ప్రస్తుతం మంట పుట్టిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 – 110 డాలర్ల మధ్య ఊగిసలాడుతోంది. ఈ ఏప్రిల్ నెలలోనే ధరలు గరిష్ట స్థాయిలను తాకాయి. గతంలో 70 డాలర్ల వద్ద ఉన్న ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల భారతీయ చమురు సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ, దేశంలో ఎన్నికల దృష్ట్యా గత రెండేళ్లుగా రిటైల్ ధరలను పెంచకపోవడం కంపెనీలకు భారీ నష్టాలను మిగిల్చింది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ. 20, లీటర్ డీజిల్‌పై ఏకంగా రూ.100 వరకు నష్టపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి చమురు సంస్థలు రోజుకు దాదాపు రూ. 1,600 కోట్ల భారాన్ని మోస్తున్నాయని అంచనా. ఈ భారీ లోటును భరించలేక కంపెనీలు తమ సరఫరాను పరిమితం చేస్తున్నాయని, ఫలితంగానే బంకులకు రావాల్సిన లోడ్లు సకాలంలో రావడం లేదని డీలర్లు వాపోతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ నష్టాలను ప్రజలపైకి నెట్టేందుకు ధరల పెంపు ఒకటే మార్గమని కంపెనీలు భావిస్తున్నాయి.
ప్రజల్లో నెలకొన్న’పానిక్ బయింగ్ కూడా ఈ కొరతను మరింత తీవ్రతరం చేస్తోంది. ధరలు పెరుగుతాయనే భయంతో వాహనదారులు ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతో, సాధారణ విక్రయాల కంటే మూడు రెట్లు ఎక్కువ డిమాండ్ పెరిగింది. దీనివల్ల బంకుల్లో ఉన్న నిల్వలు గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయి.
