ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చే లక్ష్యంతో ఉపాధ్యాయుల నైపుణ్యాలను కూడా అంతర్జాతీయ స్థాయికి పెంచాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. అందుకే గ్లోబల్ ఎక్స్పోజర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి చెందిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన దేశాల్లో సింగపూర్ ఒకటి. ముఖ్యంగా అక్కడి సెకండరీ విద్యా విధానం, బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణపై ఈ బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను మన ఉపాధ్యాయులు స్వయంగా చూసి తెలుసుకోవాలన్నది విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచన. ఈ పర్యటన ద్వారా నేర్చుకున్న అంశాలను మన రాష్ట్ర పాఠశాలల్లో అమలు చేయడం ద్వారా బోధనలో నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సింగపూర్‌తో ఈ ప్రక్రియ ఆగిపోదు. జూన్, జూలై నెలల్లో మరో ఉపాధ్యాయుల బృందాన్ని ఫిన్లాండ్ కు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రాథమిక విద్యలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే ఫిన్లాండ్ నమూనాను అధ్యయనం చేయడం ద్వారా ఏపీలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి. మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక, విద్యాశాఖలో ఉపాధ్యాయులను కేవలం బోధకులుగా కాకుండా గ్లోబల్ మెంటార్స్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువు బాగుంటేనే శిష్యుడి భవిష్యత్తు బాగుంటుంది అనే నమ్మకంతో వారికి ఇలాంటి అంతర్జాతీయ వేదికలను కల్పిస్తున్నారు.
విదేశాల్లోని ఉత్తమ పద్ధతులను మన ఊరి బడికి తీసుకొచ్చే ఈ ప్రయత్నం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ప్రపంచ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుంది. నారా లోకేష్ తీసుకుంటున్న ఇటువంటి సాహసోపేతమైన , నిర్మాణాత్మక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌ను విద్యా రంగంలో దేశానికే దిక్సూచిగా నిలబెడుతున్నాయి.
