అసలే వేసవి కాలంలో సరైన సినిమా లేక టాలీవుడ్ అల్లాడిపోతోంది. అందరి కళ్లూ ‘పెద్ది’ పైనే. ఈ సినిమా ఎప్పుడొచ్చినా థియేటర్లు బ్లాస్ట్ అయిపోవడం ఖాయమని అందరి నమ్మకం. బాక్సాఫీసుకి మళ్లీ కొత్త జోష్ తీసుకొచ్చే సత్తా ‘పెద్ది’ కి మాత్రమే ఉంది. జూన్ 4న ‘పెద్ది’ విడుదల అవుతోంది. 3 నుంచే ప్రీమియర్లు పడబోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు – ఎగ్జిబీటర్ల మధ్య సాగుతున్న రెంటల్ – పర్సంటేజీ గొడవ ఇబ్బంది పెడుతోంది.
మాకు రెవిన్యూలో షేరింగ్ కావాలి అని ఎగ్జిబీటర్లు, అలాగైతే సినిమాల్ని విడుదల చేయలేమని నిర్మాతలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. రెవిన్యూ షేరింగ్ పద్ధతిలో సినిమాల్ని విడుదల చేయకపోతే, మేం థియేటర్లు మూసేస్తాం అని ఎగ్జిబీటర్లు అల్టిమేట్టం జారీ చేశారు. దానికి తగ్గట్టుగానే శుక్రవారం విడుదలైన ‘జెట్లీ’ సినిమాను కొన్ని థియేటర్లలో ప్రదర్శించలేదు. ఈ మేరకు మైత్రీ మూవీస్ సంస్థ కూడా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రకటించింది.
అయితే ఎగ్జిబీటర్ల టార్గెట్ ‘జెట్లీ’ లాంటి చిన్న సినిమాలు కాదు. వాళ్లకు ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమాలు కావాలి. అప్పుడు రెవిన్యూ షేరింగ్ పద్ధతిలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవొచ్చు. అందుకే ఇప్పటి నుంచే పొగ పెట్టడం మొదలెట్టారు. `పెద్ది` రిలీజ్ సమయానికి ఈ ఇష్యూ క్లియర్ చేసుకోలేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈలోపే ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. వచ్చేవారం నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబీటర్లు కలిసి ఓ కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకొంటున్నారు. ఈ సమావేశంలో ఓ మధ్యే మార్గాన్ని కనుక్కొనే అవకాశం ఉంది. చిన్న సినిమాల్లో రెవిన్యూ షేరింగ్ విధానం వల్ల… ఎగ్జిబీటర్లకు ఏం మిగలదు. అదే పెద్ద సినిమాకొస్తే.. 40 శాతం ఆదాయం థియేటర్లకు ఇచ్చేస్తే నిర్మాతలకు మిగిలేది ఉండదు. అందుకే… ఈ సమస్య సర్దుబాటు అయ్యేలా కనిపించడం లేదు. పరిస్థితిని అర్థం చేసుకొని, ఎవరో ఒకరు తగ్గితే తప్ప.. ఈ చిక్కుముళ్లు వీడవు.
